ప్రియురాలి కోసమని.. కుటుంబం మొత్తాన్ని..

ప్రియురాలి కోసమని.. కుటుంబం మొత్తాన్ని..
X

పెళ్లైనా.. మరొకామెతో ప్రేమలో పడ్డాడు. ఆమె కోసం ఏం చేయడానికీ వెనుకాడలేదు. ప్రేమ మైకంలో ఉన్న అతడు కన్నతల్లిదండ్రుల్నీ, కట్టుకున్న భార్యనీ ఆఖరికి తోబుట్టువునీ హతమార్చడానికి సిద్ధపడ్డాడు. కిరాయి రౌడీలకు సుపారీ ఇచ్చి మరీ అందర్నీ హత్య చేయించి ఏమీ ఎరగనట్టు అమాయకుడిలా నటించాడు. అతడి తడ బడే మాటలే తనే తప్పు చేశాడనే విషయాన్ని రుజువు చేశాయి.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ ప్రీతమ్‌నగర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తులసీదాస్ (65), ఆయన భార్య కిరణ్ (60), కూతురు నిహారిక(37), కోడలు ప్రియాంక(22)లు దారుణ హత్యకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆతీష్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. అందులో భాగంగా సీసీటీవీ ఫుటేజి పరిశీలించారు. అయితే అది పని చేయట్లేదని చెప్పాడు ఆతీష్. దాంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆతీష్‌ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా తానే నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు.

ఆతీష్ పెళ్లైనా రంజనా శుక్లాతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఆతీష్ అందగాడు.. ఆస్తిపరుడూ కూడా కావడంతో ఒక్క దెబ్బకే రెండు పిట్టలనుకుంది. ఓ మంచి పథకం ఆలోచించి ఆతీష్‌తో చెప్పింది. ఆమెతో పీకల్లోతు ప్రేమలో మునిగిన ఆతీష్‌కి తాను చేసేది తప్పో రైటో అనేది ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ప్రియురాలి మాటే వేద వాక్కు అయిపోయింది. అందర్నీ మట్టుపెట్టేస్తే ఆస్తి మొత్తం మనకే దక్కుతుంది. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసరికి.. అనుజ్ శ్రీ వాస్తవ, ఉపేంద్ర ద్వివేది అని ఇద్దరు కిరాయి హంతకులకి 8 లక్షల సుపారీ ఇచ్చాడు.

కుటుంబ సభ్యులందరినీ హతమార్చమని చెప్పాడు. డబ్బుకోసం ఇంట్లో అందర్నీ హత్య చేశారు. అనంతరం ఆతీష్ తానే స్వయంగా పోలీసులకు ఫోన్ చేయడంతో హత్యోదంతం బయటపడింది. హత్య చేసిన హంతకులను, ఆతీష్‌ని హత్యకు స్కెచ్ వేసిన ప్రియురాలు రంజనా శుక్లాను పోలీసులు అరెస్టు చేశారు. ఆతీష్ ప్రియురాలి మాయ మాటలు నమ్మి, ఆమె మాట కాదనలేక అయిన వాళ్లందర్నీ కోల్పోయానని విచారిస్తున్నాడు. జైలు ఊచలు లెక్క పెడుతూ శిక్ష అనుభవిస్తున్నాడు.

Next Story

RELATED STORIES