కరోనా టీకా కోసం మరో అడుగు ముందుకు.. చింపాజీల నుంచి సేకరించిన..

కరోనా టీకా కోసం మరో అడుగు ముందుకు.. చింపాజీల నుంచి సేకరించిన..

కరోనా వైరస్‌కు వాక్సిన్‌ తీసుకురావడంలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ మరో ముందడుగు వేసింది. రెండోదశలో ప్రయోగాలకు అభ్యర్థుల ఎంపిక మొదలు పెట్టింది. తొలిదశలో వెయ్యి మందికి ఇమ్యూనైజేషన్‌ చేశారు. ఈ ఫలితాలను విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు రెండో దశలోనూ 10వేలమందికిపై ఈ వాక్సిన్‌ను ప్రయోగిస్తున్నారు. వీరిలో 56 ఏళ్లు పైబడిన వారు, 5-12ఏళ్ల మధ్య వారు ఉన్నారు. ఇది పూర్తైతే మూడో దశ మొదలుపెట్టనుంది. ఇందులో 18ఏళ్లు పైబడిన వారిపై ఈ వాక్సిన్‌ను ప్రయోగించి ఎలా పనిచేస్తోందో తెలుసుకొంటారు.

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ కరోనాకు వాక్సిన్‌కు అభివృద్ధి చేసింది. ఇందులోని అడినో వైరస్‌ను చింపాజీల నుంచి సేకరించింది. జన్యుపరమైన మార్పులు చేసి సార్స్‌ కోవ్‌2లో ఉండే స్పైక్‌ ప్రొటీన్‌ ఇందులో ఏర్పాటు చేశారు. ఈ వైరస్‌ శరీరంలోకి వెళ్లాక నకళ్లను సృష్టించి వ్యాపించదు. దీనిని చూసి శరీరం రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. ఈ వాక్సిన్‌ను తీసుకొన్న ఆరు రీసెస్‌ కోతులు ఈ వైరస్‌ను నిలువరించాయి. ప్రస్తుతం అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ ప్రయోగశాలలో దీనిని నిర్వహిస్తున్నారు. ఈ వాక్సిన్‌ నమ్మకమైన ఫలితాలను ఇస్తుందంటున్నారు సైంటిస్టులు.

ప్రస్తుతం రెండు, మూడో దశలే కీలకం. ఇందులో పాల్గొనే వారిలో కొందరికే కరోనావైరస్‌ కోసం చేసిన వాక్సిన్‌ ఇస్తారు. మిగిలిన వారికి మెనిక్వా (MenACWY) అనే వ్యాక్సిన్‌ ఇస్తారు. ఎవరికి ఏ టీకా ఇచ్చింది తెలియనివ్వరు. కరోనాకు వ్యతిరేకంగా ఎలా పనిచేస్తుందో అంచనావేస్తారు. అదే సమయంలో ప్రమాదకరమైన సైడ్‌ఎఫెక్ట్‌లు లేవని నిరూపించాలి. మంచి రోగనిరోధక శక్తిని పెంపొందించాలి. వీరు టీకా వేయించుకొన్న ఏడు రోజులపాటు తమ లక్షణాలను నమోదు చేయాలి. వీరిలో కొంత మందిని కొవిడ్‌ నమూనాలను సేకరించి ల్యాబ్‌లకు పంపుతారు. ఈ నమూనాలు సేకరించిన వారిలో కరోనా లక్షణాలు కనిపించాయేమో పరీక్షిస్తారు. వీరి ఇమ్యూనిటీ ఎలా పనిచేస్తోందో తెలుసుకోవడానికి రక్త పరీక్షలు నిర్వహిస్తారు.

అయితే.. ఈ వ్యాక్సిన్‌కు కనీసం రెండేళ్లు పడుతుందంటున్నారు సీరమ్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్ పూనావాలా. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివర్లో కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. పుణెకు చెందిన సీరమ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో ఏటా వివిధ రకాల 150 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లను ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం సీరమ్ సంస్థ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, అమెరికాకు చెందిన కొడాజెనిక్స్‌, ఆస్ట్రియన్ బయోటెక్ సంస్థ థెమిస్ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. వ్యాక్సిన్లు తయారీలో అమెరికాకు చెందిన మోడెర్నా, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ఈ వరుసలో ముందున్నాయన్నారు.

Tags

Read MoreRead Less
Next Story