సచివాలయ ఉద్యోగికి కరోనా.. తెలంగాణ నుంచి ఏపీ వచ్చిన 280 మంది ఉద్యోగులు

సచివాలయ ఉద్యోగికి కరోనా.. తెలంగాణ నుంచి ఏపీ వచ్చిన 280 మంది ఉద్యోగులు

ఏపీలో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. ప్రభుత్వ కర్యాలయాలు, జైళ్లను సైతం వదలడంలేదు. తాజాగా ఏపీ సచివాలయ ఉద్యోగికి కరోనా నిర్ధారణ కావడం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. నాలుగు రోజుల క్రితం తెలంగాణ నుంచి వచ్చిన వెలగపూడి సచివాలయ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు అధికారులు. కరోనా సోకిన ఉద్యోగి నవులూరులోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రొటోకాల్‌కు సంబంధించిన అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. మొత్తం 280 మంది ఉద్యోగులను తెలంగాణ నుంచి ఆంధ్రకు తీసుకొచ్చిన అధికారులు.. వారిలో ఒకరికి పాజిటివ్ రావడంతో అప్రమత్తమయ్యారు. దీంతో వారందరినీ సి.కె. కన్వెన్షన్ హాల్‌లో వుంచి పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారందరినీ హోం క్వారంటైన్‌కు తరలించారు.

అటు ఒంగోలు జైళ్లోనూ కరోనా కలకలం సృష్టించింది. రిమాండ్‌లో వున్న ఓ ఖైదీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. ఒంగోలులో ఓ చోరీ కేసులో నిందితుడిగా వున్న విజయవాడకు చెందిన వ్యక్తిని ఇటీవల ఒంగోలు తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని కోర్టులో హాజరుపరుచగా న్యాయమూర్తి అతనికి రిమాండ్ విధించారు. దీంతో అతన్ని ఒంగోలు జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో జ్వరంతో బాధపడుతున్న సదరు ఖైదీని.. రిమ్స్‌కు పంపించి వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. సమాచారం అందుకున్న జైలు సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఖైదీలతో పాటు.. జైలు సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జైల్లో అతడు ఎవరెవరిని కలిశాడు. ఎవరెవరితో సన్నిహితంగా వున్నాడన్న విషయాన్ని అధికారులు ఆరా తీస్తున్నారు. అటు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story