తగ్గిన కరోనా ప్రభావం.. వేల కేసులతో అల్లాడిపోయిన దేశాలు ఇప్పుడు..

తగ్గిన కరోనా ప్రభావం.. వేల కేసులతో అల్లాడిపోయిన దేశాలు ఇప్పుడు..

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఐతే కొన్ని దేశాల్లో మాత్రం మహమ్మారి ప్రభావం తగ్గిపోయింది. నెలరోజుల క్రితం వరకు ఆ దేశాలను బెంబేలెత్తించిన వైరస్ ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. అలాంటి దేశాల్లో ఇటలీ టాప్ ప్లేస్‌లో ఉంది. క‌రోనా క‌రాళ నృత్యం చేసిన ఇట‌లీలో వైర‌స్ వ్యాప్తి గ‌ణ‌నీయంగా తగ్గింది. ఒకప్పుడు వేల కేసులు, వందల మరణాలతో అల్లాడిపోయిన ఇటలీలో ఇప్పుడు రోజుకు ఐదారు వందల కేసులు మాత్రమే వస్తున్నాయి. రోజువారీ మరణాల సంఖ్య కూడా వందలోపే ఉంటోంది. కరోనా ప్రభావిత దేశాల్లో ఇటలీ ఆరో స్థానంలో ఉంది. ఇక్కడ 2 లక్షల 35 వేల కేసులున్నాయి. 34 వేల మంది చనిపోయారు. దాదాపు 2 నెలల పాటు ఇటలీని కరోనా అతలాకుతలం చేసింది. ఇప్పుడిప్పుడే ఆ దేశం కరోనా నుంచి బయటపడుతోంది. ప్రస్తుతం క‌రోనా వైర‌స్‌లో శ‌క్తి సామ‌ర్థ్యం బాగా త‌గ్గిపోయింద‌ని ఇటలీ వైద్యులు పేర్కొన్నారు. ఇప్పుడు కరోనాతో ప్రజల ప్రాణాలకు పెద్దగా ముప్పు లేదని చెప్పారు. 2 నెల‌ల క్రితం చూసిన వైర‌స్‌కు, గ‌త 2 వారాలుగా చూస్తున్న వైర‌స్‌కు మధ్య గ‌ణ‌నీయ‌మైన తేడా ఉంద‌న్నారు. కరోనా బలహీనపడిందంటూ వైద్యులు ప్రకటించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

స్పెయిన్‌లోనూ వైరస్ తీవ్రత తగ్గింది. ఇక్కడ 2 లక్షల 87 వేల కేసులు ఉన్నప్పటికీ రోజువారీ కొత్త కేసులు సంఖ్య బాగా తగ్గిపోయింది. రోజుకు 200, 300 చొప్పున కేసులు వస్తున్నాయి. మరణాల సంఖ్యైతే ఇంకా తగ్గిపోయింది. రోజుకు పదుల సంఖ్యలో కూడా మరణాలు నమోదు కావడం లేదు. ఫ్రాన్స్, జర్మనీ, టర్కీ, కెనెడాల్లోనూ అదే సీన్. ఈ దేశాల్లో రెండు వారాల క్రితం వరకు కూడా రోజుకు వేల సంఖ్యలో కేసులు వచ్చాయి. ఇప్పుడు కొత్త కేసుల సంఖ్య వందల్లోనే ఉంటోంది. డెయిలీ డెత్ రేట్ కూడా చాలావరకు తగ్గింది. మొత్తంగా, నిన్నమొన్నటి వరకు చండప్రచండంగా కరోనా చెలరేగి న దేశాల్లో ఇప్పుడు అంత సీరియస్‌నెస్ లేదు. ఈ వాదనను ప్రపంచ ఆరోగ్య సంస్థ తోసిపుచ్చింది. కరోనా ఇప్పటికీ ప్రాణాంతకమే అని స్పష్టం చేసింది. కిల్లర్ వైరస్‌తో జాగ్రత్తగా ఉండాలని, కఠిన చర్య లు ఇంకొంతకాలం అమలు చేయాలని సూచించింది.

ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీల్లో వైరస్ వ్యాప్తి బాగా తగ్గినప్పటికీ అమెరికా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్‌లో మాత్రం వైరస్ విజృంభణ కొనసాగుతోంది. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 18 లక్షల 40 వేలకు పెరిగింది. మృతుల సంఖ్య లక్ష 7 వేలు దాటింది. రోజుకు కొత్తగా 20 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. రష్యాలో పరిస్థితి దిగజారిపోతోంది. రోజుకు 10 వేలకు పైగానే కేసులు వస్తున్నా యి. బాధితుల సంఖ్య 4 లక్షల 10 వేలకు చేరింది. దాదాపు 5 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్‌లో కరోనా కల్లోలం రేపుతోంది. ఇక్కడ వైరస్ పీడితుల సంఖ్య 5 లక్షల 15 వేలు దాటింది. బ్రెజి ల్‌లో రోజుకు 17 వేలకు పైగా కేసులు నమోదవుతుండడంతో ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story