కరోనా కేసుల్లో ఇటలీని దాటేసిన భారత్‌

కరోనా కేసుల్లో ఇటలీని దాటేసిన భారత్‌

దేశంలో ఊహకందని విధంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. పాజిటివ్‌ కేసుల్లో ఇటలీని భారత్‌ మించిపోయింది. ఇటలీలో ఇప్పటి వరకు 2 లక్షల 34 వేల కేసులు నమోదు కాగా.. 2 లక్షల 36 వేలకు పైగా కేసులతో ఆదేశాన్ని భారత్‌ దాటిపోయింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు అధికంగా ఉన్న దేశంగా భారత్‌ ఆరో స్థానంలో నిలిచింది. ఫస్ట్‌ ప్లేస్‌లో అమెరికా కొనసాగుతోంది. మరో వారంలో రోజుల్లో నాలుగో స్థానంలో చేరుతుందన్న వైద్య నిపుణుల అంచనాలు మరింత కలవరం రేపుతున్నాయి.

భారత్‌లో కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తోంది. లాక్‌డౌన్‌ పెట్టి ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా వైరస్‌ మాత్రం కంట్రోల్‌ కావడం లేదు. నిపుణులు హెచ్చరించిన విధంగానే జూన్‌లో కరోనా మరింత ప్రమాదకరంగా మారింది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఏ రోజు బులెటిన్‌ విడుదల చేస్తే.. ఆ రోజు అదే రికార్డు. గత వారం నుంచి దేశంలో ప్రతి రోజు 9 వేల నుంచి 10 వేల మధ్య కోవిడ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. శనివారం 9వేల 887 కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు ఇదే అత్యధికం.

కేసుల్లో ఇటలీని మించిపోయిన భారత్‌ మృతుల సంఖ్యలో దూరంగానే ఉంది. ఇటలీతో పోలిస్తే మన దేశంలో మరణాలు 5 రెట్లు తక్కువగా ఉండడం ఊరట కలిగించే అంశం. ఇటలీలో ఇప్పటి వరకు 27 వేలమందికిపైగా చనిపోయారు. రోజువారీగా ఎక్కువ కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో ఇన్నాళ్లూ నాలుగో స్థానంలో ఉన్న భారత్‌.. తాజాగా రష్యాను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకుంది. అమెరికా, బ్రెజిల్‌ మాత్రమే మనకంటే ముందున్నాయి. భారత్‌ వీటిని కూడా వెనక్కి నెట్టినా ఆశ్చర్యపడాల్సింది లేదని వైద్య నిపుణులు అంటున్నారు.

దేశంలో గతంలో పోలిస్తే టెస్టుల సామర్థ్యం భారీగా పెరిగింది. ప్రతిరోజు దేశంలో లక్షా 40 వేలకుపైగానే పరీక్షలు చేస్తున్నారు. దీని సామర్థ్యం కూడా రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 50 లక్షల వరకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఒక్కరోజులో లక్ష 43 వేలకుపైగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం కూడా ఓ రికార్డే. అయితే కేసుల పరంగా భారత్‌ ఆరో స్థానంలో ఉందని చెప్పడం సరికాదంటున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. జనాభాను బట్టి చూస్తే మనం వెనుకంజే ఉన్నామని చెబుతున్నారు.

దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో.. ఒక్క మహారాష్ట్రలో 40 శాతం కేసు నమోదవుతున్నాయి. ఇక్కడ కరోనా బాధితులు 80 వేలు దాటారు. మరణాల సంఖ్య కూడా ఈ రాష్ట్రం టాప్‌ ప్లేస్‌లో ఉంది. మహారాష్ట్ర తర్వాత ప్రతిరోజు దేశ రాజధాని ఢిల్లీలోనే కోవిడ్‌ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఢిల్లీలో పరీక్షలు చేయించుకుంటున్నవారిలో సగటున ప్రతి నలుగురిలో ఒకరు వైరస్‌ పాజిటివ్‌గా తేలుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story