బోనాలొద్దు సార్: సీఎంతో వైద్య, ఆరోగ్య శాఖ

బోనాలొద్దు సార్: సీఎంతో వైద్య, ఆరోగ్య శాఖ

బోనాలు, వినాయక ఉత్సవాలు ఇవన్నీ ప్రజలంతా కలిసి చేసుకునే పండుగ సంబరాలు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ పండుగలను నిర్వహిస్తే వైరస్ వ్యాప్తికి అవకాశం ఇచ్చిన వాళ్లమవుతాం, అప్పుడు కేసుల విస్పోటం తప్పదని వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు ఆ శాఖ ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్ కు నివేదిక సమర్పించినట్లు సమాచారం. ప్రతి ఏటా ఆషాఢ మాసం మొదలు ఈ బోనాల ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో బోనాల జాతర నిర్వహిస్తారు.

గోల్కొండ బోనాలతో మొదలై లష్కర్, లాల్ దర్వాజ బోనాలతో సంబరాలు ముగుస్తాయి. ఈ వేడుకల్లో వేల మంది భక్తులు పాల్గొంటారు. అమ్మవారికి బోనం సమర్పించడంతో పాటు మద్యం, మాంసాహార వంటకాలు సంబరాల్లో భాగమవుతాయి. ఈ నెల 22 నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానుంది. దీంతో బోనాల ఏర్పాట్లు మొదలవుతాయి. కానీ, రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రబలుతున్న నేపథ్యంలో బోనాలకు అనుమతించడం శ్రేయస్కరం కాదని వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది.

జన సమూహాన్ని నిలువరించడం పోలీసులకు సాధ్యమయ్యే పని కాదని, కరోనా వ్యాప్తికి అవకాశం ఇచ్చిన వారమవుతామని సీఎంకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. మర్కజ్ సంఘటనను సీఎంకు మరోసారి గుర్తు చేశారు. ఇటలీ, ఇరాన్ వంటి దేశాలు మత సంబంధమైన కార్యక్రమాలకు అనుమతించడం వల్లే అక్కడ పరిస్థితి అదుపు తప్పిందని నివేదికలో వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story