భారత్ - చైనా మధ్య ఘర్షణ దాదాపు 20 మంది భారత జవాన్లు వీర మరణం

భారత్ - చైనా మధ్య ఘర్షణ దాదాపు 20 మంది భారత జవాన్లు వీర మరణం
X

భారత్ - చైనా మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు 20 మంది భారత జవాన్లు వీర మరణం పొందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పది మంది మృతదేహాలను గుర్తించగా.. మిగిలిన వారిని గుర్తించాల్సి ఉన్నట్లు చెబుతున్నారు. తొలుత కల్నల్ సంతోష్‌తో మరో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కొల్పోయినట్లు వివరాలు వెల్లడించినా.. ఆ తర్వాత ప్రాణ నష్టం అంతకు మించి జరిగినట్లు గుర్తించారు. అటు చైనా వైపు కూడా భారీ సంఖ్యలో నష్టం జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు 43 మంది ప్రాణాలు కొల్పోయినట్లు, లేదా గాయపడినట్లు చెబుతున్నారు. అయితే.. ఎంత మంది చనిపోయారనే విషయంపై స్పష్టత రాలేదు. చైనా వైపు జరిగిన నష్టంపై పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎలాంటి ప్రకటన చేయటం లేదు.

వాస్తవాధీన రేఖ వెంట గాల్వన్ లోయలో భారత్- చైనా ఆర్మీల మధ్య రాళ్లు, కర్రలతో భీకర ఘర్షణ జరిగింది. వాస్తవాధీన రేఖ వెంబడి ఇలాంటి ఉద్రిక్తలు చాలాసార్లు చోటు చేసుకున్నా.. 45 ఏళ్లుగా రెండు వైపుల నుంచి ప్రాణ నష్టం జరగలేదు. శత్రుదేశం బలగాలను వెనక్కి తరమటమే లక్ష్యంగా తోపులాట, చిన్నపాటి ఘర్షణలు మాత్రమే చోటు చేసుకునేవి. కానీ, సోమవారం మాత్రం చైనా కవ్వింపు చర్యలతో చోటు చేసుకున్న ఘర్షణ హింసాత్మకంగా మారింది. ప్రస్తుతానికి భారత్‌కు చెందిన జవాన్లు 20 మంది వరకు చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నా.. ప్రాణనష్టం ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అటు చైనా వైపు కూడా ప్రాణనష్టం భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో మృతి చెందిన వారిని చైనా హెలికాఫ్టర్ల ద్వారా తరలించినట్లు సమాచారం.

చైనా తీరుపై భారత ప్రభుత్వం తీవ్రస్థాయిలో మండిపడింది. చర్చల ద్వారా సరిహద్దు సమస్యను పరిష్కరించుకుందామని చెప్పి ఇలా దాడులకు తెగబడడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా దాడులపై రక్షణమంత్రి రాజ్‌నాధ్‌సింగ్, ప్రధాని మోదీకి వివరాలు అందించారు. అంతకుముందు త్రివిధ దళాలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. విదేశాంగమంత్రి జైశంకర్, చీఫ్‌ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు త్రివిధ దళాల అధిపతులు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఇండో చైనా బోర్డర్‌లో లేటెస్ట్ సిచ్యువేషన్‌పై చర్చించారు. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నేపథ్యంలో ఆర్మీ చీఫ్ తన పఠాన్‌కోట్ పర్యటనను రద్దు చేసుకున్నారు.

చైనా మాత్రం తమ తప్పేమీ లేదని బుకాయించింది. అంతా భారత సైన్యమే చేసిందని ఎదురుదాడి చేసింది. భారత బలగాలే సరిహద్దు దాటి వచ్చి తమ సైనికులపై దాడి చేశాయని ఆరోపించింది. భారత బలగాలు 2 సార్లు బోర్డర్ క్రాస్ చేశాయని చెప్పుకొచ్చింది. భారత జవాన్లు తమ సైనికులను రెచ్చగొట్టడం వల్లే దాడులు జరిగాయని సమర్దించుకుంది. ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించింది.

దాదాపు నెల రోజులకు పైగా లద్ధాఖ్ ఏరియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లద్ధాఖ్‌లోని ప్యాంగ్యాంగ్ త్సో, గాల్వన్ వ్యాలీ, డెమ్‌చోక్‌, దౌల‌త్ బేగ్ ఓల్డీ ప్రదేశాల్లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ప్యాంగ్యాంగ్‌ త్సోలో చైనా బలగాలు పెద్ద సంఖ్యలో తిష్ట వేశాయి. మే 9న చైనా సైన్యం భారత సైన్యంపై దాడి చేసింది. బోర్డర్ క్రాస్ చేసిన చైనా జవాన్లు, భారత సైనికులపై విచక్షణారహితంగా అటాక్ చేసింది. చైనా సైనిక హెలికాప్టర్లు కూడా లద్ధాఖ్ సరిహద్దుల్లో చక్కర్లు కొట్టాయి. ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం 10 వేల మంది సైనికులను సరిహద్దులకు తరలించింది. యుద్ధ విమానాలు, ఫిరంగులను కూడా మోహరించింది. చైనా కూడా భారీగా బలగాలను రంగంలోకి దింపింది. ఫలితంగా ఆ ప్రాంతంలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఉద్రిక్తతను తగ్గించడానికి ఇరు దేశాలు చర్యలు చేపట్టాయి. సైనిక, దౌత్యపరమైన సంప్రదింపులు జరిగాయి. చర్చలతో సమస్య పరిష్కారమైందని, బలగాలను ఉపసంహరిస్తున్నామని చైనా చెప్పుకొచ్చింది. ఈ ప్రకటన చేసిన వారం రోజుల్లోనే చైనా బలగాలు దాడులకు తెగబడింది. ఉద్రిక్తతలను నివారించడానికి ఇరు దేశాలు మళ్లీ చర్చలు ప్రారంభించాయి. మేజర్ జనరల్‌ స్థాయి అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

ఇండియా-చైనా సరిహద్దులో ఈ స్థాయిలో హింస చోటుచేసుకోవడం 1975 తర్వాత ఇదే తొలిసారి. 45 ఏళ్ల తర్వాత చైనాతో జరిగిన ఘర్షణలో భారత సైనికులు అమరులయ్యారు. అంతకుముందు 1975లో అరుణాచల్‌ప్రదేశ్‌లో ఇరు దేశాల సైనికులు కొట్టుకున్నారు. భారత పెట్రోలింగ్ బృందంపై చైనా దాడి చేసింది. ఆ దాడిని భారత సైన్యం సమర్ధవంతంగా తిప్పికొట్టింది. తులుంగ్ లా ప్రాంతంలో జరిగిన ఆ ఘర్షణలో నలుగురు భారత జవాన్లు అమరులయ్యారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇండో చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

Next Story

RELATED STORIES