చైనా కంపెనీలకు మహారాష్ట్ర సర్కార్ షాక్!

చైనా కంపెనీలకు మహారాష్ట్ర సర్కార్ షాక్!

భారత్‌ -చైనా ఉద్రిక్తల పరిస్థితుల్లో.. చైనా ఉత్పత్తులు, వారితో వాణిజ్య ఒప్పందాలు నిషేధించాలని దేశవ్యాప్తంగా డిమాండ్‌ ఊపందుకుంటోంది. ఇలాంటి స్థితిలో మహారాష్ట్ర ఓ అడుగు ముందుకేసింది. చైనా కంపెనీలకు మహారాష్ట్ర సర్కార్ షాకిచ్చింది. సుమారు 5 వేల కోట్ల ఒప్పందాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. మ్యాగ్నటిక్‌ మహారాష్ట్ర 2.0 పెట్టుబడుల సదస్సులో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం చైనా సంస్థలతో మూడు ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పందాలు చేసుకుంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో వాటిని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు.. మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్‌ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే.. ఒప్పందాలు నిషేధిస్తున్నామని.. మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీటిలో ఆటో మొబైల్‌ ప్లాంట్ ఏర్పాటుకు గ్రేట్‌ వాల్‌ మోటర్స్ సంస్థ 3 వేల 770 కోట్లు, PMI ఎలక్ట్రో మొబిలిటీ వెయ్యి కోట్లు, హెంగ్లీ ఇంజినీరింగ్‌ సంస్థ 250 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులున్నాయి.

తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో.. చైనాతో జరిగిన ఘర్షణలో మన 20 మంది సైనికులు వీరమరణం పొందారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా చైనా ఉత్పత్తులు బహిష్కరించాలనే డిమాండ్ ఊపందుకుంది. దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం మద్దతుగా ఒప్పందాలు రద్దు చేసి షాకిచ్చింది. అటు భారతీయ రైల్వే చెందిన DFCCIL సంస్థ చైనాకు చెందిన కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story