రోజుకి 40 వేలకు పైగా కేసులు.. కట్టడి మార్గం కనిపించట్లేదు: యూఎస్ హెల్త్ సెక్రటరీ అలెక్స్ అజర్

రోజుకి 40 వేలకు పైగా కేసులు.. కట్టడి మార్గం కనిపించట్లేదు: యూఎస్ హెల్త్ సెక్రటరీ అలెక్స్ అజర్

మహమ్మారి విజృంభణ మరింత విస్తృతమవుతోంది. నివారణ చర్యలు ఎన్ని చేపట్టినా వైరస్ ని వదిలించుకోలేకపోతున్నామని యూఎస్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ అలెక్స్ అజర్ అంటున్నారు. రోజు రోజుకి కొత్త కేసులు నమోదవడంతో కట్టడి చేసే దారులన్నీ మూసుకుపోతున్నట్లనిపిస్తుందని అన్నారు. ఆదివారం ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ మహమ్మారిని ఎదుర్కునేందుకు మరిన్ని కఠిన చర్యలు అమలు పరచాలనుకుంటున్నట్లు చెప్పారు. పరీక్షల సంఖ్యను పెంచడం, ఆస్సత్రుల సామర్థ్యం, వ్యక్తిగత పరిరక్షణ కిట్లను భారీగా పెంచడం వంటి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

కాస్త తగ్గుముఖం పట్టింది కదా అని అనుకుంటున్న తరుణంలో మళ్లీ విజృంభించడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. 35 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారే వైరస్ బారిన పడుతున్నారని తెలిపారు. చాలా మందికి ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో వైరస్ వాహకులుగా మారారని దాంతో భారీ స్థాయిలో కేసుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించట్లేదని ఆరోపించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేయకపోతే వైరస్ వ్యాప్తి పెరుగుతుందని హెచ్చరించారు.

గత కొన్ని రోజులుగా అమెరికాలో రోజుకు 40 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం న్యూయార్క్ నగరాన్ని పట్టి పీడించిన వైరస్ ప్రస్తుతం అమెరికా పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించిందని అన్నారు. అరిజోనా రాష్ట్రంలో ఆదివారం కొత్త కేసుల సంఖ్య 267 శాతం పెరిందని అన్నారు. కాగా, సోమవారం ఉదయం నాటికి అమెరికాలో నమోదైన కేసుల సంఖ్య 25,93,169. మరణించిన వారి సంఖ్య 1,27,693.

Tags

Read MoreRead Less
Next Story