AP: ఏపీ రైతులపై..విద్యుత్‌ సంస్కరణల పిడుగు..

AP: ఏపీ రైతులపై..విద్యుత్‌ సంస్కరణల పిడుగు..
అప్పుల కోసం తిప్పలు పడుతూ విద్యుత్తు సంస్కరణల బాట పట్టిన రాష్ట్ర ప్రభుత్వం అదే క్రమంలో వ్యవసాయ ఉచిత విద్యుత్తు పొందుతున్న రైతులకు షాక్‌ ఇవ్వబోతోంది.

ఆంధ్ర ప్రదేశ్‌లో రైతులు, బడుగులు, బలహీనవర్గాలపై కేంద్రం విద్యుత్‌ సంస్కరణల పిడుగువేసింది. విద్యుత్‌ సంస్కరణల అమలు చేస్తున్న జగన్‌ ప్రభుత్వం 2021-22, 2022-23లో 9,574 కోట్ల అప్పులు తెచ్చింది. అప్పుల కోసం తిప్పలు పడుతూ విద్యుత్తు సంస్కరణల బాట పట్టిన రాష్ట్ర ప్రభుత్వం అదే క్రమంలో వ్యవసాయ ఉచిత విద్యుత్తు పొందుతున్న రైతులకు షాక్‌ ఇవ్వబోతోంది.కేంద్రం ప్రకటించిన సంస్కరణల అమలుకు ఇప్పటికే అడుగులు వేస్తున్న రాష్ట్రం తాజా కండిషన్లనూ పాటించాల్సి ఉంటుంది. వ్యవసాయ విద్యుత్తు కోసం మీటర్ల ఏర్పాటుకు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. ఇకపై రైతులకు నేరుగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందదు. రైతులు వ్యవసాయానికి ఎంత కరెంటు వాడతారో దాన్ని మీటర్లతో లెక్కిస్తారు. రైతు ఆ మేరకు బిల్లు చెల్లించాలి. తర్వాత తాము వ్యవసాయ విద్యుత్తు బిల్లు ఇంత మొత్తం చెల్లించినట్లు సర్కారుకు నివేదిస్తే రైతుల ఖాతాల్లో ఆ మొత్తాలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాల్సి ఉంటుంది. వ్యవసాయానికి రాయితీపై ఇస్తున్న విద్యుత్తు లేదా కొన్ని వర్గాలకు కొన్ని యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్న విద్యుత్తు కానీ ఏదైనా ఇకపై ఇదే విధానం అవలంబించాలి. కేంద్ర షరతులకు రాష్ట్రం ఆమోదం తెలియజేస్తున్న క్రమంలో ఇక ప్రతి ఒక్కరూ విద్యుత్తు బిల్లులు చెల్లించాల్సిందే. రాయితీలు ఏమైనా ఉంటే ఆ మొత్తాలు ఆ తర్వాత వారి ఖాతాల్లో జమవుతాయి. ముందే కరెంటు బిల్లు చెల్లించాలంటే వ్యవసాయానికి అదనపు పెట్టుబడి అవుతుందని, అదీకాక చెల్లించిన బిల్లు ప్రభుత్వం ఎప్పుడు తిరిగిస్తుందో అని ఎదురుచూడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే డిజిటల్‌ మీటర్లు వద్దంటూ పోరాటం చేస్తున్న రైతులు తాజా సంస్కరణల అమలుపై ఆందోళనతో ఉన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం- 2023-24లో ఈ విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తే రాష్ట్రాలకు లక్షా 43,332 కోట్ల అదనపు అప్పులకు అనుమతి ఇస్తామని కేంద్రం ప్రకటించింది. సంస్కరణల అమలు తీరును బట్టి ఆయా రాష్ట్రాల స్థూల ఉత్పత్తిలో 0.25 నుంచి 0.5 శాతం వరకు అదనపు అప్పులకు అనుమతులు ఇస్తామని పేర్కొంది. ఈ లెక్కన రాష్ట్రానికి మరో ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా రుణం తీసుకునే అవకాశం లభిస్తుంది. విద్యుత్తు సంస్కరణలకు అనుసంధానంగా అదనపు అప్పులు ఇచ్చే విధానాన్ని కేంద్రం ఇంతకు ముందు కూడా అమలు చేసింది. ఆ మేరకు విద్యుత్తు సంస్కరణలు అమలు చేసిన ఏపీ 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో 9,574 కోట్ల అదనపు అప్పు పొందిందని కేంద్రం వెల్లడించింది. ఈ రూపేణా గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో 12 రాష్ట్రాలు 66,413 కోట్ల మేర అదనపు రుణాలు పొందినట్లు తెలిపింది.

కేంద్రం పేర్కొన్న ప్రకారం అదనపు రుణం పొందాలంటే రాష్ట్రాలు కొత్తగా విద్యుత్తు సంస్కరణల అమలు చేయాల్సిందే విద్యుత్తు రంగంలో ఆర్థిక అంశాలన్నీ పారదర్శకంగా ఉండాలి. ప్రభుత్వాలు విద్యుత్తుకు ఎంత సబ్సిడీ భరిస్తున్నాయి, డిస్కంలకు ఎంత మొత్తం బాకీ పడ్డాయనేది స్పష్టంగా వెల్లడించాలి. విద్యుత్తు పంపిణీ సంస్థల నష్టాలను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి. వ్యవసాయ రంగం సహా మొత్తం ఎంత విద్యుత్తు ఎక్కడెక్కడ వినియోగిస్తున్నారో మీటర్లు ఏర్పాటు చేసి, స్పష్టంగా లెక్కలు తేల్చాలి. మొత్తం విద్యుత్తు వినియోగంలో ఎంత శాతానికి మీటర్ల వ్యవస్థ ఏర్పాటయిందో కూడా పరిగణనలోకి తీసుకుంటారు. సాంకేతిక, వాణిజ్య విద్యుత్తు నష్టాలను తగ్గించగలగాలి. విద్యుత్తు సరఫరాకు, వస్తున్న ఆదాయానికి మధ్య వ్యత్యాసాన్ని తగ్గించగలగాలి. ఒకే లబ్ధిదారు విద్యుత్తు రంగంలో రెండు రకాలుగా సబ్సిడీ పొందకుండా చూడాలి. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రీపెయిడ్‌ విద్యుత్తు మీటర్లు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల విద్యుత్తు బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలి.

మొత్తానికి కేంద్రం కొత్తగా ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణల అమలు రాష్ట్రంలోని రైతులు, బడుగు, బలహీనవర్గాలు, ఆక్వా రైతులు, చిన్నాచితకా పరిశ్రమలపై ప్రభావం చూపనుంది. మరింత బాదుడు తప్పని పరిస్థితి ఏర్పడింది. సంస్కరణలకు ప్రాధాన్యమిచ్చి ప్రజలకు షాకులు ఇవ్వడానికి సిద్ధపడిన రాష్ట్రాలకు అదనపు అప్పులకు కేంద్రం అవకాశం కల్పిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story