Chandrababu: చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

Chandrababu: చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
రిమాండ్ ను శిక్షగా భావించవద్దన్న జడ్జి

ఏసీబీ కోర్టు కీలక తీర్పునిచ్చింది. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ను విజయవాడలోని ఏసీబీ కోర్టు పొడిగించింది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో అరెస్టైన ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి రిమాండ్‌ని మరో రెండు రోజులు పొడిగించారు. రిమాండ్ అంశంపై ఇవాళ వీడియో కాన్ఫిరెన్స్ లో చంద్రబాబును విజయవాడ ఏసీబీ జడ్జి ముందు ప్రవేశపెట్టింది సీఐడీ. చంద్రబాబుకు రిమాండ్ 24 వరకు పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.

ఈ సందర్భంగా విచారణ సందర్భంగా... మిమ్మల్ని కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరుతోందని చంద్రబాబుకు జడ్జి తెలిపారు. రిమాండ్‌లో ఉన్నప్పుడు మీకు ఏదైనా సమస్య వచ్చిందా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనిపై మాట్లాడిన చంద్రబాబు... తాను ఏ తప్పూ చెయ్యలేదనీ, తన గురించి దేశంలో అందరికీ తెలుసని అన్నారు. తనను అకారణంగా జైల్లో పెట్టారనే తన బాధ, ఆవేదనంతా అదే అని చంద్రబాబు అనగా జడ్జి. ‘ఇది ట్రైల్ కాదు. మీ మీద ఉన్నవి ఆరోపణలు మాత్రమే. మీరు మరోలా అర్ధం చేసుకోవొద్దు. ఈ కేసులో ఇంకా ఎలాంటి తీర్పు రాలేదు. మీరు చాలా పెద్దవారు. మీ మాటలను నేను అర్థం చేసుకోగలను. కోర్టు కి ఒక విధానం ఉంటుంది. వాటిని ఎవరు మార్చలేరు. కోర్ట్ దాని పరిధిలో పని చేస్తోంది. మీరు జ్యూడిషియల్ కస్టడీలో వున్నారు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. విచారణ చేస్తాం. మీరు మానసికంగా బాధ పడొద్దు. చట్టం విషయాన్ని మీరు హుందాతనంగా తీసుకోవాలి.’ అన్నారు. రిమాండ్‌ను శిక్షగా భావించొద్దు, ఇది చట్ట ప్రకారం జరుగుతున్న కార్యక్రమం అని జడ్జి వివరించారు.

రాజకీయ కక్షలో భాగంగానే తనను అరెస్ట్ చేశారని బాబు తెలిపారు. తన వివరణ తీసుకోకుండానే అరెస్ట్ చేశారని, తన అరెస్ట్ అక్రమమని చెప్పారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం కలిగిన తనకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. తన హక్కులను కాపాడాలని, న్యాయాన్ని రక్షించాలని జడ్జిని కోరారు. జైల్లో తనను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు చెప్పిన విషయాలను నోట్ చేసుకున్నట్టు జడ్జి తెలిపారు.

మరోవైపు చంద్రబాబు తరపు లాయర్లు తమ వాదననలు వినిపిస్తూ... చంద్రబాబును కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. మరోవైపు, చంద్రబాబు కస్టడీపై కాసేపట్లో తీర్పు వెలువడే అవకాశం ఉంది. కస్టడీ తీర్పు నేపథ్యంలో సర్వత్ర తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story