ఏపీ వ్యాప్తంగా హోరెత్తిన రాజధాని పోరాటం

ఏపీ వ్యాప్తంగా హోరెత్తిన రాజధాని పోరాటం
అమరావతి దద్దరిల్లింది. రాజధాని పోరాటం 300వ రోజుకు చేరువైన సందర్భంగా.. ధర్నాలు, దీక్షలతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. ఒక్క అమరావతిలో కాదు..ఏపీ వ్యాప్తంగా..

అమరావతి దద్దరిల్లింది. రాజధాని పోరాటం 300వ రోజుకు చేరువైన సందర్భంగా.. ధర్నాలు, దీక్షలతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. ఒక్క అమరావతిలో కాదు..ఏపీ వ్యాప్తంగా రాజధాని పోరాటం హోరెత్తింది. సేవ్‌ అమరావతి అంటూ ప్రజలు కాగడాల ప్రదర్శన చేపట్టారు. మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని ముద్దంటూ తమ ఆకాంక్షను తెలియజేశారు.క్యాండిల్‌ ర్యాలీలో భారీ ఎత్తున రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

అమరావతి పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా కృష్ణా జిల్లా జి.కొండూరులో మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కాగడాల ప్రదర్శనలో పాల్గొన్నారు. రైతుల దీక్షకు సంఘీభావం తెలిపారు. న్యాయస్థానంలో ప్రజాపోరాటమే గెలుస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. విశాఖలో రాజధాని పేరిట భూదందా జరుగుతోందని విమర్శించారు.

అమరావతి పరిరక్షణే ధ్యేయంగా.. గుంటూరు జిల్లా అచ్చంపేటలో టీడీపీ నేతలు, రైతులు కాగడాల ర్యాలీ నిర్వహించారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానులు వద్దు... ఒకే రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేశారు.

కర్నూలులో అమరావతి ఉద్యమం హెరెత్తింది. రైతులకు మద్దతుగా టీడీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. గాలిలోకి బెలూన్‌లు వదులుతూ అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. చంద్రబాబుకు పేరు వస్తుందనే అక్కసుతో జగన్‌ కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. రాజధానిపై జగన్‌ మూడు ముక్కలాట ఆడుతున్నారని విమర్శించారు.

రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో టీడీపీ శ్రేణులు క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించాయి. గాంధీ విగ్రహం నుంచి రైల్వేస్టేషన్‌ వరకు అమరావతి రైతులకు మద్దతుగా.. జిల్లా పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. 3 రాజధానులు వద్దు.. ఒకే రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేశారు.

అమరావతి రాజధానికి మద్దతుగా తిరుపతిలో జేఏసీ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని అంటూ నినాదాలు చేశారు. ప్రాణాలైనా ఇస్తాం.. అమరావతిని సాధిస్తామంటూ గళమెత్తారు. జగన్‌ అమరావతి ద్రోహి అంటూ నిప్పులు చెరిగారు.

Tags

Read MoreRead Less
Next Story