కూలి పనులు చేస్తూ.. కెమిస్ట్రీ పాఠాలు వల్లెవేస్తూ పీహెచ్‌డీ..

కూలి పనులు చేస్తూ.. కెమిస్ట్రీ పాఠాలు వల్లెవేస్తూ పీహెచ్‌డీ..
అనుకోవాలే కానీ అసాధ్యం ఏదీ కాదు అని నిరూపించింది. ముందు నిన్ను నువ్వు నమ్ముకో.. ఇతరులు ఎన్ని అన్నా పట్టించుకోకు.

అనుకోవాలే కానీ సాధ్యం కానిది ఏదీ లేదు అని నిరూపించింది. ముందు నిన్ను నువ్వు నమ్ముకో.. ఇతరులు ఎన్ని అన్నా పట్టించుకోకు. ఆ కష్టమేదో నువ్వే పడు. వారికేం తెలుసు ఆ కష్టాన్ని ఇష్టంగా మలుచుకున్నావని.. క్లాసు రూముల్లో కూర్చుని శ్రద్ధగా వింటేనే అర్థం కాని కెమిస్ట్రీ పాఠాలు ఆడుతూ, పాడుతూ, కూలి పనులు చేసుకుంటూ అందులో పీహెచ్‌డీ చేసిందంటే హ్యాట్సాఫ్ అనాల్సిందే..

అనంతపురం జిల్లా నాగులగూడెం గ్రామానికి చెందిన సాకే భారతి అనే యువతి దృఢ సంకల్పానికి, కృషికి నిదర్శనంగా నిలుస్తోంది. నిరాడంబరమైన నేపథ్యం నుండి వచ్చిన భారతి చిన్నతనం నుండి చదువంటే ఇష్టం. కానీ చదువుకునే అవకాశం కానీ, పై చదువులు చదివించే స్థోమతలేని తల్లి దండ్రుల కోరికను కాదనలేక పెళ్లి చేసుకునేందుకు తల వంచింది.

తల్లిదండ్రుల ముగ్గురు సంతానంలో పెద్దది అయిన భారతి ఆమె 12వ తరగతి వరకు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదివింది. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా, ఆమె ఇంటర్ పూర్తి చేసిన తర్వాత ఆమెకు మేనమాతో వివాహం జరిపించారు తల్లిదండ్రులు. పెళ్లైన ఏడాదిలోనే ఆమెకు మొదటి బిడ్డ పుట్టింది. కానీ చదువుకోవాలనే కోరికను చంపుకోలేకపోయింది. విద్య ద్వారానే తమ ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయని భావించింది.

చదువుకోవాలనే తన కల నెరవేరే పరిస్థితి అత్తగారింట్లో కూడా కనిపించలేదు. వ్యవసాయ కూలీగా మారింది. కూలీ పనులు చేస్తూ చదువుకోవానుకుంది. భార్యగా, తల్లిగా, బాధ్యతలు నిర్వర్తిస్తూనే కూలి పనులకు వెళ్తూ చదువుకోవడం ప్రారంభించింది. భారతి అనంతపురంలోని SSBN డిగ్రీ మరియు PG కళాశాలలో రసాయన శాస్త్రంలో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

ప్రతిరోజూ, ఆమె తన ఇంటి పనులను పూర్తి చేసిన తర్వాత తెల్లవారుజామున నిద్రలేచి, పని లేదా కళాశాలకు హాజరవుతుంది. ఆమె తన గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి వెళ్లేందుకు కొద్ది దూరం నడిచి బస్సు ఎక్కాల్సి వచ్చేది. అయినా ఎప్పుడూ నిరుత్సాహ పడలేదు. సంకల్పబలం ముందు అవన్నీ చిన్న చిన్న సమస్యలుగా కనిపించాయి. ఆమె ఉత్సాహాన్ని చూసిన ఉపాధ్యాయులు శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో PhD చేయమని ప్రోత్సహించారు.

చదువుకోవాలని తనకు ఉన్నా తన భర్త శివ ప్రసాద్ ప్రోత్సాహం లేనిదే ఇక్కడ వరకు వచ్చేదాన్ని కానని భారతి వినమ్రంగా చెబుతుంది. తన కోరికను అర్థం చేసుకుని ఆయన ప్రోత్సహించారని తన భర్త గురించి గర్వంగా చెప్పుకుంటుంది.

“తాను యూనివర్శిటీలో ఫ్యాకల్టీగా పనిచేయాలనుకుంటున్నానని చెప్పింది. విద్య ద్వారా మాత్రమే సమాజగతిని మార్చడం సాధ్యపడుతుందని, ఆర్థిక పరిస్థితులు మెరుగు పడతాయని ప్రారంభంలోనే తాను అర్థం చేసుకున్నానని భారతి అంటోంది. ఆర్థిక సవాళ్లు ఎన్ని ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి చదువుపైనే శ్రద్ధ పెట్టానని అదే తనను ఉన్నత విద్య వైపు నడిపించింది అని అంటుంది. పనికి వెళితేనే డబ్బులు వస్తాయి. వాటితోనే చదువుకోవాలి. అందుకే నెలలో చాలా రోజులు పని చేస్తుండేదానన్ని చెప్పింది. స్కాలర్‌షిప్‌లు కూడా తన చదువుకు తోడ్పడ్డాయని భారతి చెప్పింది.

భూమిలేని వ్యవసాయ కూలీ అయిన ఆమె భర్త శివప్రసాద్ మాట్లాడుతూ తన భార్య సాధించిన విజయానికి సంతోషం వ్యక్తం చేశారు. "ఆమె ఎప్పుడూ జీవితంలో ఏదో సాధించాలని తాపత్రయపడుతుండేది. ఆమె చివరకు తాను అనుకున్నది చేసింది" అని తన భార్య గురించి సంతోషంగా చెప్పుకుంటున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story