AP Budget : నేడే ఏపీ బడ్జెట్... 2 లక్షల 31 వేల కోట్ల అంచనా...!

AP Budget :  నేడే  ఏపీ బడ్జెట్... 2 లక్షల 31 వేల కోట్ల అంచనా...!
AP Budget : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2022-23కు వేళయింది. ఇవాళ అసెంబ్లీలో ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ఆర్థిక మంత్రి బుగ్గన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

AP Budget : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2022-23కు వేళయింది. ఇవాళ అసెంబ్లీలో ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ఆర్థిక మంత్రి బుగ్గన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మొత్తం 2 లక్షల 31 వేల కోట్ల అంచనాతో వస్తున్న బడ్జెట్‌పై అన్ని వర్గాల్లో భారీ ఆశలు ఉన్నాయి. అలాగే వ్యవసాయం కోసం ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అయితే అంతకుముందే ఉదయం 9 గంటలకు కేబినేట్ భేటీ కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో 2022-23 బడ్జెట్‌ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది.

గత బడ్జెట్ అంచనా 2 లక్షల 29 వేల 779 కోట్లు కాగా.. ఈసారి మొత్తం 2 లక్షల 31 వేల కోట్ల అంచనాతో భారీ బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. వీటిలో లక్షా 80 వేల కోట్లు రాబడిగా అంచనా వేసినట్లు సమాచారం. సొంత ఆదాయంగా 85 వేల కోట్లు, గ్రాంట్ల రూపంలో 60 వేల కోట్లు, కేంద్రం పన్నుల వాటా కింత 35 వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఇక దాదాపు 28 వేల 866 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం.

ఇక.. రెండేళ్లలో ఎన్నికలు ఉన్న దృష్ట్యా ఈసారి బడ్జెట్‌లో నవరత్నాల అమలు, సంక్షేమానికే ప్రభుత్వం పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. అమ్మఒడి, వైఎస్సార్ రైతు భరోసా, నాడు-నేడు, ఆరోగ్యశ్రీ, జగనన్న కాలనీలతో పాటు వ్యవసాయం, విద్యా, వైద్య ఆరోగ్యం, సాగునీటి రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. అలాగే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేలా ప్రత్యేక కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీ రెవెన్యూ తగ్గిపోయిన కారణంగా కేంద్ర పన్నుల వాటాపైనే ప్రభుత్వం ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. అలాగే రెవెన్యూ లోటు భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇక ఆదాయ మార్గాల అన్వేషణతో పాటు రాజధాని అమరావతికి నిధుల కేటాయింపుపై కూడా ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు తీర్పుతో అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయిస్తారా..? లేదా..? అనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేయాల్సి ఉండటంతో పాటు ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం.. వాటికి కేటాయింపులు కూడా పెంచాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story