AP Debt Crisis: వివిధ రూపాల్లో ఏపీ ప్రభుత్వం తెచ్చిన అప్పు రూ.58,111 కోట్లు..

AP Debt Crisis: వివిధ రూపాల్లో ఏపీ ప్రభుత్వం తెచ్చిన అప్పు రూ.58,111 కోట్లు..
AP Debt Crisis: వంద రూపాయల ఆదాయం ఉన్నవాళ్లు.. 10-20 రూపాయలు అప్పు చేశారంటే దాన్నెవరూ తప్పుపట్టరు.

AP Debt Crisis: వంద రూపాయల ఆదాయం ఉన్నవాళ్లు.. 10-20 రూపాయలు అప్పు చేశారంటే దాన్నెవరూ తప్పుపట్టరు. తీర్చగలిగే పరిస్థితిలో ఉన్నప్పుడు 100 రూపాయల ఆదాయానికి ఇంకో 50-60 రూపాయలు అప్పు చేసినా పర్వాలేదనే అనిపిస్తుండొచ్చు. కానీ 100 రూపాయల ఆదాయానికి ఆ 100 చాలక ఇంకో 100 అప్పు చేస్తే దాన్ని ఖచ్చితంగా ఆర్థిక సంక్షోభం అనే కదా చెప్పాలి. ఏపీ ఖజానా పరిస్థితి చూస్తున్న ఆర్థిక నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రెవెన్యూ లోటు ఏకంగా 918 శాతానికి పెరిగిపోవడంతో.. వాస్తవ అంచనాలకు, ఖర్చులకు మధ్య ఎక్కడా పొంతనే కనిపించడం లేదు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు 5 వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. దీన్ని బట్టి ఆదాయ, వ్యయాల లెక్కలు వేసుకుని బడ్జెట్‌ ప్రతిపాదించారు. తీరా ఇప్పుడు చూస్తే అంతా అస్తవ్యస్థమైంది.

ఆ ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో రెవెన్యూ లోటు ఏకంగా 45 వేల 907 కోట్లకు చేరింది. 5 వేల కోట్లు అనుకున్న చోట ఏకంగా అది 46 వేల కోట్ల వరకూ చేరిందంటే దీనికి కారణం ఎవరు..? అసలేం జరుగుతోంది..? ఇలాగైతే భవిష్యత్ ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి..! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకు సరాసరిన 5 వేల కోట్ల రూపాయలు అప్పులు తెస్తోంది.

సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా కావచ్చు.. వివిధ బ్యాంక్‌లు, కేంద్ర సంస్థల నుంచి తీసుకునే రుణాలు కావచ్చు.. ఆస్తులు తాకట్టుపెట్టో మరొకటి చేసో కావచ్చు 5 వేల కోట్లు తెచ్చి వాడేస్తోంది. ఇలా ఈ ఫైనాన్షియల్ ఇయర్‌ తొలి 9 నెలల్లో తెచ్చిన అప్పు ఏకంగా 58 వేల 111 కోట్లు. ఇదే సమయంలో ప్రభుత్వానికి వచ్చిన సొంత ఆదాయం 69 వేల 943 కోట్లు. అంటే అప్పునకు, ఆదాయానికీ మధ్య ఎంత స్వల్పమైన తేడా ఉందో అర్థం చేసుకోవచ్చు.

నిజానికి ఈ ఏడాదిలో మొత్తం అప్పుల అంచనా 37 వేల కోట్లు. కానీ ఇప్పటికే అది 58 వేల కోట్లు దాటేసింది. ఇంత అప్పులు చేసి తెస్తున్నా అవసరాలు గడుస్తున్నాయా అంటే అదీ లేదు. కొత్తగా ఏ రంగానికీ కేటాయింపుల్లేవ్‌.. కాంట్రాక్టర్లకు బిల్లుల్లేవ్‌.. ఉద్యోగులకు టైమ్‌కి జీతాల్లేవ్‌..! ప్రతిపక్షాలు ప్రధానంగా ఈ అంశాన్నే ప్రస్తావిస్తూ YCP సర్కార్‌ను నిలదీస్తున్నాయి.

రాష్ట్రంలో ఈ ఆర్థిక సంక్షోభం ఎందుకు వచ్చింది, రెవెన్యూ లోటు ఎందుకు పెరిగింది అంటే దీనికి YCP సర్కారు చెప్తున్న కారణం కరోనా. కానీ.. TDP మాత్రం ఇదంతా అబద్ధంటూ కొట్టి పడేస్తోంది. సర్కారు పాలసీలే ఈ దారుణాలకు కారణమంటోంది. కరోనా ప్రభావం లేకపోయినా YCP అధికారంలోకి వచ్చిన 2019-20లో ప్రభుత్వ ఆదాయం తగ్గిందని లెక్కలు చూపిస్తున్నారు.

ఏటా 10-15 శాతం పెరగాల్సిన ఆదాయం రివర్స్‌లో తగ్గిందంటేనే పాలన ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. వైసీపీ వచ్చిన తొలి ఏడాదిలోనే 5 వేల కోట్ల ఆదాయం తగ్గిందని లెక్కలు చూపిస్తున్నారు. ఇక 2020-21లో ముందు ఏడాదితో పోలిస్తే 5 వేల కోట్ల ఆదాయం పెరిగిందని, అప్పుడు లాక్‌డౌన్‌ ప్రభావం ఉన్నా ఆదాయం పెరిగింది అంటే దానికి మద్యం దరల పెంపు వంటివి కారణమని చెప్తున్నారు.

ఇక 2021-22లో పరిస్థితి కాస్తంత మెరుగవుతున్నా దానికి కారణం.. పన్నుల వాతలేనని వివరిస్తున్నారు TDP నేతలు..! సరాసరిన చూస్తే YCP వచ్చాక ఏపీ తిరోగమనంలో వెళ్లిందని.. తెస్తున్న వేల కోట్లు అప్పులు, వస్తున్న ఆదాయం ఏమైపోతోందో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి సొంత ఆదాయం 69 వేల 943 కోట్లు, కేంద్ర గ్రాంట్‌లు 25 వేల కోట్లు కలిపి ఈ సంవత్సరం ఇప్పటికి 98 వేల కోట్లు వచ్చాయి.

దీనికి తెచ్చిన అప్పుల్ని కూడా కలిపి చూస్తే మొత్తం 1 లక్ష 56 వేల కోట్లు పైనే..! ఈ డబ్బంతా జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు, రెవెన్యూ ఖర్చుల రూపంలో ఖర్చైపోతోంది. కొన్ని సందర్భాల్లో అప్పులకు వడ్డీ చెల్లించడానికి కూడా కొత్త అప్పు చేయాల్సి వస్తోంది. అటు చూస్తే రెవెన్యూ లోటు ఏకంగా 900 శాతం పెరగడం.. ఇటు చూస్తే అప్పులు సొంత ఆదాయానికి దగ్గర దగ్గరగా ఉండడం బట్టి.. తీవ్రమైన సంక్షోభం ఎదురవడానికి ఇంకెంతో దూరం లేదనే విషయం అర్థమవుతోందంటున్నారు విశ్లేషకులు.

ప్రస్తుతం ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో సింహభాగం GST వసూళ్ల నుంచి వస్తోంది. ఇలా వచ్చే ఆదాయం 23 వేల కోట్లకుపైగా ఉంది. ఇక స్టాంప్‌లు రిజిస్ట్రేషన్ల ద్వారా 5 వేల 320 కోట్లు రాబడి ఉంది. అమ్మకపు పన్నులు 17 వేల కోట్లు, ఎక్సైజ్‌ డ్యూటీ 9 వేల 700 కోట్లు, సెంట్రల్ ట్యాక్సుల్లో వాటా 12 వేల కోట్లు, కేంద్రం గ్రాంట్‌లు 25 వేల కోట్లుగా ఉంది.

ఇలా వస్తున్న లక్షా 56 వేల కోట్లు ఎంత ప్లాన్‌తో ఖర్చు చేస్తున్నట్టు చెప్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా.. ఆదాయానికి మించిన స్థాయిలో ఖర్చులు ఉండడంతో బ్యాలెన్స్ షీట్‌ లెక్క తప్పుతోంది. రెవెన్యూ లోటు ఏకంగా 918 శాతానికి పెరిగిపోయిన నేపథ్యంలో వచ్చే బడ్జెట్లో అయినా ఖర్చులకు కళ్లెం వేసేలా చర్యలు లేకపోతే ఏపీ దివాళీ తీయడం ఖాయమనే మాట వినిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story