ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నివర్‌ తుఫాను బీభత్సం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నివర్‌ తుఫాను బీభత్సం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నివర్‌ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం బృగుబండలో ఎద్దువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ధాటికి రోడ్డు కొట్టుకుపోవడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణా జిల్లా మైలవరంలో నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో జోరుగా వర్షం కురుస్తోంది. అర్థరాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. మైలవరంలో వర్షం బీభత్సం సృష్టించింది. పెద్దఎత్తున పత్తి, వరి పంట దెబ్బతింది. పత్తి తీసే దశలో అకాల వర్షం కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మైలవరం మార్కెట్‌ యార్డ్‌లో ఆరబోసిన మొక్కజొన్న పంట.... తడిసిపోయింది.

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో భారీ వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. భారీ వర్షానికి సామర్లకోట, పిఠాపురం మార్గంలో వరద ధాటికి తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. ఈ నెల 13న సామర్లకోట, పిఠాపురం మార్గంలో చిన్న ఏలేరు వంతెన కూలిపోయింది. సామర్లకోట, పిఠాపురం మధ్య అధికారులు తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేశారు. తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి తాత్కాలిక రోడ్డు కూడా కొట్టుకుపోయింది. రోడ్డు దెబ్బతినడంతో లారీ దిగబడిపోయింది.

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం కందాడు పంచాయతీ శివగిరి కాలనీ వద్ద... కోన కాలువ ప్రవాహం పెరగడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముగ్గురు పిల్లలు, ఇద్దరు పెద్దలు ఉన్న ఓ కుటుంబం నీటి ప్రవాహం మధ్యలో చిక్కుకుపోయింది. బాధితులను రక్షించేందుకు శ్రీకాళహస్తి అగ్నిమాపక సిబ్బంది, సహాయ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బాధితులను కాపాడేందుకు చర్యలు చేపట్టారు. బాధితులకు డ్రోన్‌ సాయంతో ఆహార ప్యాకెట్‌లను అందజేశారు.

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఐరాల దగ్గర వాగు దాటుతుండగా కారు కొట్టుకుపోయింది. ప్రమాదంలో పాలకూరుకు చెందిన వినయ్‌రెడ్డి చనిపోయాడు. కారును, మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు.నెల్లూరు జిల్లా పెన్నా పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్న వారి పరిస్థితి భయానకంగా మారింది. సోమశిల నిర్మాణం తర్వాత తొలిసారి 5లక్షల క్యూసెక్కుల నీటిని తొలిసారి విడుదల చేస్తున్నారు. నీటి ఉధృతికి పెన్నా కట్టలు తెగిపోతున్నాయి. కట్టలు కోతకు గురవుతున్న ప్రాంతాల్లో అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. జనార్దన్‌రెడ్డి కాలనీ, భగత్‌సింగ్‌ కాలనీ, సాకుచింతల ఏరియాల ప్రజల్ని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.

కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని సిరిగేపల్లిలో ఎడతెరిపిలేని వర్షాలకు వరిపంట నేలకొరిగింది. రెండు రోజులుగా గురుస్తున్న వర్షాలకు వందల ఎకరాల పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వం, అధికారులు గ్రామాల్ని సందర్శించి పంట నష్టం అంచనా వేయాలని రైతులు వేడుకుంటున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ, పెనుమంట్ర, ఆచంట, పోడూరు మండలాల్లో భారీ వర్షాలకు 500 ఎకరాల వరి పంట నీట మునిగింది. చేతికి అందివచ్చిన పంట దెబ్బ తినడంతో రైతులు బోరున విలపిస్తున్నారు. ఎకరాకు 25వేల నుంచి 30వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతున్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేట, యలమంచిలి, చోడవరం, అనకాపల్లిలో వందల హెక్టార్లలో వరి పంటకు నష్టం జరిగింది. భారీ గాలుల ధాటికి వరిపంట నేలకొరిగింది. పంట దెబ్బతిన్న గ్రామాల్లో పర్యటించి అధికారులు.. నష్టం అంచనా వేశారు.

Tags

Read MoreRead Less
Next Story