AP EC: ఏపీలో మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్‌

AP EC: ఏపీలో మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్‌
నాలుగు నెలల్లో ఓటర్ల జాబితా సిద్ధం... 10 లక్షల బోగస్ ఓట్లు తొలగించామన్న ఎంకే మీనా

ఆంధ్రప్రదేశ్‌ మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌కుమార్‌ మీనా అన్నారు. ముసాయిదా జాబితాను ముకేష్‌కుమార్‌ మీనా విడుదల చేశారు. నాలుగు నెలల్లో ఓటర్ల జాబితాలు సిద్ధం చేస్తామని తెలిపారు.10 లక్షల బోగస్‌ ఓట్లను గుర్తించి తొలగించామన్న మీనా ఈవీఎంల తొలి దశ పరిశీలన సైతం జరుగుతోందని చెప్పారు. తప్పుడు అభ్యంతరాలు, తప్పుడు దరఖాస్తులు సమర్పించే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తామని ముకేష్‌కుమార్‌ మీనా స్పష్టంచేశారు. ఏపీ ముసాయిదా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలో మొత్తం 4 కోట్ల 2 లక్షల 21 వేల 450 మంది ఓటర్లున్నారు. మహిళలు 2కోట్ల 3 లక్షల 85 వేల851 మంది, పురుషులు కోటి 98 లక్షల 31వేల791 మంది, ఇతరులు 3వేల808 మంది ఉన్నారని ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌కుమార్‌ మీనా తెలిపారు. 2024 ముసాయిదా ఓటర్ల జాబితా నాటికి 2లక్షల 36వేల 586 మంది ఓటర్లు పెరిగారన్న ఆయన ప్రతి 1000 మంది పురుషులకు మహిళా ఓటర్లు 1,031 మంది ఉన్నారని చెప్పారు.


2023 ఓటర్ల జాబితా నుంచి 2024 ముసాయిదా జాబితా మధ్య కొత్తగా 15లక్షల 84వేల789 మంది చేరారన్నారు. ఇందులో వేరే చోటనుంచి తరలివచ్చిన వారు 5లక్షల 47వేల 19 మంది, ఇతరలు 6లక్షల 54వేల 73 మంది ఉన్నారని చెప్పారు. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 19లక్షల 79వేల775 మంది ఓటర్లు ఉండగా... అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7లక్షల 40వేల857 మంది ఓటర్లు ఉన్నారు. 2023 ఓటర్ల జాబితా 13లక్షల 48వేల203 ఓట్లు తొలగించామన్న మీనా... ఇందులో మరణించిన వారు 6లక్షల 88వేల 393 మంది, వేరే చోటకు తరలివెళ్లిన వారు 5లక్షల 78వేల625 మంది,రెండు చోట్ల ఓటు ఉండటం వల్ల తొలగించిన వారు 81వేల185 మంది ఉన్నారని చెప్పారు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోనూ ముసాయిదా అందుబాటులో ఉంచుతామన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్‌ మీనా... అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు.అదే సమయంలో మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందన్నారు.

ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా సమగ్ర పరిశీలన చేశామన్న మీనా మొత్తం 21లక్షల 18వేల 940 ఓట్లు తొలగించామన్నారు. అందులో కేవలం 1,533 ఓట్ల తొలగింపు విషయంలోనే లోపాలు చోటు చేసుకున్నట్లుగా జిల్లా పాలనాధికారులు తెలియజేశారని పేర్కొన్నారు. సున్నా ఇంటి నంబర్లతో 2,51,767 మంది ఓటర్లు ఉండగా ఇంటింటి సర్వే తర్వాత ఆ సంఖ్య 66,740 ఓట్లకు తగ్గిందన్నారు. ఒక్కో ఇంట్లో పది మంది కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న ఇళ్లు లక్ష 57వేల 939 ఉన్నాయన్నారు. సర్వే తర్వాత ఆ సంఖ్య 71వేల581కు తగ్గిందన్నారు.సుమారు 10 లక్షల బోగస్‌ ఓట్లను గుర్తించి తొలగించామని మీనా తెలిపారు..

Tags

Read MoreRead Less
Next Story