CID కేసులు కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ

CID కేసులు కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ
అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ లేదని హైకోర్టు తేల్చిచెప్పిందని.. మరి ఇప్పుడు వైసీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని నిలదీసింది తెలుగుదేశం.

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా పాపులర్ అయిన పదం. అమరావతి నుంచి రాజధానిని మార్చాలని డిసైడ్ అయిన ప్రభుత్వం ... అక్కడ పెద్ద ఎత్తున ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రచారం చేసింది. అంతేకాదు ఏకంగా సీఐడీ విచారణకు కూడా ఆదేశించింది.

రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసుకుని కొందరు అక్కడ భూములు కొని లబ్ది పొందారన్న ప్రధాన అభియోగంతో దర్యాప్తు మొదలు పెట్టిన CID.. వెర్ టక్స్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ సహా ఆరు సంస్థలు, వ్యక్తులపై అభియోగాలు మోపింది. దీనిపై ఆయా సంస్థలు క్వాష్ పిటిషన్ దాఖలు చేశాయి.

భూములు అమ్మినవారు ఫిర్యాదు చేయకుండా.. కేసులు ఎలా పెడతారని పిటిషనర్ల తరపు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదించారు. సెప్టెంబర్‌ 7.. 2020లో సీఐడీ రిపోర్టు ఆధారంగా అక్టోబర్‌ 16, 2020న పెట్టిన కేసులు కొట్టివేయాలంటూ.. వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనల తర్వాత CID కేసులు కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇన్‌సైడర్ ట్రేడింగ్ IPC సెక్షన్లకు వర్తించదని.. ప్రైవేట్ భూముల కొనుగోళ్లకు బ్రీచ్‌ ఆఫ్ ట్రస్ట్‌ ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. నమ్మకద్రోహం, కుట్ర లాంటివి ఇక్కడ వర్తించవని.. రైతులు తెలిసే తమ భూములు అమ్ముకున్నారని.. కొనుగోలుదారులపై కేసులు పెట్టడం సరికాదని హైకోర్టు పేర్కొంది. భూములు కొనుగోలు చేయడం, భారత పౌరుడి, రాజ్యాంగ, న్యాయపరమైన హక్కు అంటూ స్పష్టం చేసింది. ఈ అమ్మకాల్లో రిజిస్టర్డ్‌, సేల్‌డీడ్స్ ఉన్నాయని పేర్కోంది. ప్రైవేట్ వ్యక్తుల మధ్య లావాదేవీలు క్రిమినల్ నేరాల కిందకు రావని స్పష్టం చేసింది. వారిని ప్రాసిక్యూట్ చేసే అధికారం ఎవరికీ లేదని తేల్చింది. FIRను క్వాష్ చేస్తూ ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు.. భజన్‌లాల్ కేసులో సుప్రీం తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావంచింది.

అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ లేదని హైకోర్టు తేల్చిచెప్పిందని.. మరి ఇప్పుడు వైసీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని నిలదీసింది తెలుగుదేశం. పంచాయతీ ఎన్నికల నిలుపుదలను స్వాగతించిన మంత్రులు.. ఈ తీర్పుని స్వాగతించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ పేరు చెప్పి ప్రజారాజధాని అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు.

అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు.. వైసీపీ ప్రభుత్వం చెప్పిన కారణాల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఒకటి. మరి ఇప్పుడు అక్కడ అలాంటిదేమీ జరగలేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పుతోనైనా వైసీపీ ప్రభుత్వం కళ్లుతెరిచి అమరావతి తరలింపును ఆపాలన్న డిమాండ్ ఊపందుకుంది.


Tags

Read MoreRead Less
Next Story