ఫలితాల నిలిపివేతపై ఎన్నికల సంఘానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ

ఫలితాల నిలిపివేతపై ఎన్నికల సంఘానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ
టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించిన ఎస్‌ఈసీ.. వెంటనే కలెక్టర్లతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మూడో దశలో ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాల నిలిపివేతపై ఎన్నికల సంఘానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ రాశారు.. ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ అధికారులు ఫలితాలను ప్రకటించడం లేదని ఆయన లేఖలో ఫిర్యాదు చేశారు.. అధికార పార్టీ ఒత్తిడితో అధికారులు ఫలితాలను నిలిపివేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చంద్రబాబు అన్నారు.

కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలోని బావిపల్లి, చంద్రపల్లిలో.. అలాగే చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని దేశగౌనూరులో, అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని మడిగుబ్బ, గుంతకల్లు మండలంలోని నేలగొండలో, గుంటూరు జిల్లా మాచవరం మండలంలోని కొత్తగణేశునిపేటలో.. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని రావివలస, పర్లలో టీడీపీ మద్దతుదారులు గెలిచినా ఫలితాన్ని ప్రకటించకపోవడాన్ని లేఖలో ప్రస్తావించారు చంద్రబాబు.

ఇక కందుకూరు నియోజకవర్గం కలవల్ల పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారు రెండు ఓట్లతో గెలిచినా.. రీకౌంటింగ్‌ జరిపి వైసీపీ మద్దతుదారుడు 21 ఓట్ల తేడాతో గెలిచినట్లు ప్రకటించారని లేఖలో కంప్లయింట్‌ చేశారు. ఫలితాల నిలిపివేత ఈ గ్రామాలకు మాత్రమే పరిమితం కాదన్నారు.. నిలిపివేసిన ఫలితాలను వెంటనే ప్రకటించి, క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజల భాగస్వామ్యాన్ని కాపాడటానికి తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీని అభ్యర్థించారు చంద్రబాబు.

మరోవైపు కుప్పం నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. గుడుపల్లి మండలం సోదిగానిపల్లెలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వైసీపీ నేతలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇతర ప్రాంతాల వైసీపీ నేతలు వస్తున్నారని... రామకుప్పం మండలం పెద్దూరులో గొడవలు సృష్టించేందుకు రౌడీ షీటర్ సత్య ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ గూండాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంటే.. కొందరు పోలీసులు చోద్యం చూస్తూ కూర్చోవడం సరికాదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అలజడులు సృష్టిస్తున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకుని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అటు అధికార పార్టీ దౌర్జన్యాలపై టీడీపీ నేతలు ఎస్‌ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు.. టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీ సహా పలువురు నేతలు ఎస్‌ఈసీని కలిశారు.. మూడో విడత ఫలితాల్లో కొన్ని జిల్లాల్లో టీడీపీ మద్దతుదారులు గెలిచినా ప్రకటించడం లేదని కంప్లయింట్‌ చేశారు.. పోలీసులు బలవంతంగా టీడీపీ మద్దతుదారులపై దాడులు చేస్తూ కౌంటింగ్‌ కేంద్రాల నుంచి పంపించేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడెక్కడ ఆ విధంగా పోలీసులు వ్యవహరించారో ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లారు టీడీపీ నేతలు. పోలీసులు గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులను బెదిరిస్తున్నారని.. వెంటనే అలాంటి చోట ఎన్నికలు రద్దు చేసి మళ్లీ పోలింగ్‌ నిర్వహించాలని వారు డిమాండ్‌ చేశారు.

టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించిన ఎస్‌ఈసీ.. వెంటనే కలెక్టర్లతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story