TDP: "ఫైబర్ నెట్‌"పై టీడీపీ పుస్తకం

TDP: ఫైబర్ నెట్‌పై టీడీపీ పుస్తకం
ప్రాజెక్టులో ఒక్క రూపాయి అవినీతి జరగలేదన్న టీడీపీ... జగన్‌ ప్రభుత్వానివి అసత్య ఆరోపణలని విమర్శ...

చంద్రబాబుపై బురద జల్లాలనే దురుద్దేశంతో జగన్‌ ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో రూపాయి కూడా దారి తప్పలేదని తెలుగుదేశం సీనియర్ నేత, P.A.C ఛైర్మన్ పయ్యావుల కేశవ్ తేల్చిచెప్పారు. 30 కోట్ల ప్రభుత్వ పెట్టుబడితో ఇప్పటికే 900 కోట్ల రూపాయలు ఆదాయం ఆర్జించిన గొప్ప ప్రాజెక్టుపై అడ్డగోలుగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఆరోపణకూ సవివరంగా సమాధానం ఇచ్చారు. "ఏపీ ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టు వాస్తవాలు - జగన్‌రెడ్డి ముఠా అబద్ధపు ఆరోపణలు' పేరిట పుస్తకాన్ని తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, PAC ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్, సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు పుస్తకాన్ని ఆవిష్కరించారు.


ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టుపై ప్రభుత్వం చేసిన 12 ఆరోపణలకు తెలుగుదేశం స్పష్టమైన సమాధానాలు ఇచ్చింది. డిజిటల్‌ ఇండియాలో భాగంగా ప్రధాని మోదీ భారత్‌ నెట్‌ను ప్రారంభించిన తర్వాత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో ఫైబర్‌నెట్‌ ప్రారంభించారని కేశవ్‌ తెలిపారు. IAS సత్యనారాయణ ఆధ్వర్యంలో కమిటీ వేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. తర్వాత PWC సంస్థతో కన్సల్టెన్సీ అధ్యయనం చేసి అండర్‌గ్రౌండ్‌ కేబుళ్లకు 4వేల320 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మెయింటినెన్స్‌ కోసం మరో 1200 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని నివేదిక ఇచ్చిందని కేశవ్‌ వివరించారు. ఇంప్లిమెంటేషన్ కమిటీ, మానిటరింగ్ కమిటీ వేశారన్న కేశవ్‌ ఇన్ని కమిటీలతో పకడ్బందీగా ప్రాజెక్టు అమలు చేశారని చెప్పారు. 330 కోట్లలో 30 కోట్లు ప్రభుత్వం ఇస్తే మిగతాది కార్పొరేషన్‌ బ్యాంకుల నుంచి లోన్‌ తెచ్చుకుందన్న కేశవ్‌.. అలాంటప్పుడు ఇందులో అవినీతి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. టెరాసాఫ్ట్ కంపెనీ ఫేక్‌ ధ్రువపత్రం ఇచ్చిందన్న ఆరోపణలు పూర్తి అవాస్తమని కేశవ్‌ స్పష్టంచేశారు.


టెరాసాఫ్ట్ కన్సార్టియంలో ఓ కంపెనీ చట్టం కింద నమోదు కాలేదన్న ఆరోపణలపై స్పందించిన పయ్యావుల కేశవ్‌....దాన్ని పరిశీలించాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపారు. పీవోఎస్‌ యంత్రాలను సమయానికి జారీ చేయలేదని టెరాసాఫ్ట్‌ సంస్థను పౌరసరఫరాల సంస్థ బ్లాక్‌లిస్టులో పెట్టిందన్న కేశవ్‌...ఆ సంస్థ వివరణ తర్వాత బ్లాక్‌లిస్టు నుంచి తొలగించారని చెప్పారు. పైగా టెండర్లు పిలిచేపటప్పటికి ఆ సంస్థ బ్లాక్‌లిస్టులో లేదని స్పష్టం చేశారు. ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టులో ఒక్కరూపాయి కూడా అవినీతి జరగలేదన్న కేశవ్‌... దాన్ని నిరూపిస్తామని... అందుకు సీఐడీ సిద్ధమా అని సవాల్‌ విసిరారు.

Tags

Read MoreRead Less
Next Story