సీఎం జగన్‌కు ఏపీ టీడీపీ అధ్యక్షుడు బహిరంగ లేఖ

సీఎం జగన్‌కు ఏపీ టీడీపీ అధ్యక్షుడు బహిరంగ లేఖ

వరుస విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. నివర్‌ తుఫాన్‌తో పాటు అంతకు ముందు కురిసిన అకాల వర్షాలకు.. రాష్ట్రంలో దాదాపు 6 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని లేఖలో గుర్తు చేశారు. అక్టోబర్‌లో కురిసిన వర్షాలకు వారంపాటు ముంపులో మునిగి ఉంటేనే నిత్యావసర వస్తువులు ఇస్తామన్న మీరు.. ఇప్పుడు నివర్ తుఫాను వల్ల నష్టపోయిన వారి పరిస్థితి ఏంటో చెప్పాలని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. లక్షలాది ఎకరాలు నీట మునిగి కష్టాల్లో ఉన్న రైతులను కనీసం పట్టించుకోవడం లేదని.. మనోధైర్యం చెప్పేవారు కూడా కరువమయ్యారని అన్నారు. బూతులు తిట్టడంలో ఆరితేరిన మంత్రులకు.. రైతును పరామర్శించడానికి మాత్రం నోరు పెగలడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.

జిల్లాల్లో ముంపు ఎక్కువగా ఉంటే.. అమరావతి మునిగిందా లేదా అని గాల్లో చక్కర్లు కొట్టి చేతులు దులుపుకున్నారు. వరద ఎంత వస్తుందో ముందే అంచనా వేసి తగిన జాగ్రత్తలు చేపట్టడంలోనూ విఫలమయ్యారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిని ముంచేందుకు కుట్ర పన్ని.. రైతుల పంటలను బలిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో 3 వేల 759 కోట్ల రూపాయల ఇన్ పుట్ సబ్సీడీని విడుదల చేస్తే.. అదే మీ పాలనలో 18 నెలల్లో కేవలం 135 కోట్లు మాత్రమే విడుదల చేయడం.. రైతుల సంక్షేమం పట్ల మీ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా వరుస విపత్తులతో తీవ్రంగా నష్టపోయి రైతులను ఆదుకోవాలని సీఎంకు రాసిన లేఖలో కోరారు అచ్చెన్నాయుడు.

Tags

Read MoreRead Less
Next Story