AP Theaters: ప్రభుత్వం చేతుల్లోకి ఏపీ థియేటర్లు.. పరిశ్రమ వర్గాల్లో ఆందోళన

AP Theaters: ప్రభుత్వం చేతుల్లోకి ఏపీ థియేటర్లు.. పరిశ్రమ వర్గాల్లో ఆందోళన
AP Theaters: ఇక నుంచి ఎన్ని షోలుండాలి, ఎప్పుడుండాలి.....టికెట్ రేట్లు ఎంతా ఇలా అన్ని ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.

AP Theatres: ఏపీ థియేటర్లు పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఇక నుంచి ఎన్ని షోలుండాలి, ఎప్పుడుండాలి.....టికెట్ రేట్లు ఎంతా ఇలా అన్ని ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఇకనుంచి ఆన్‌ లైన్‌ టికెటింగ్‌ విధానమే అమల్లో ఉంటుంది. ఫోన్లు, ఇంటర్‌నెట్‌ ద్వారా ఇంటి నుంచే బుక్‌ చేసుకోవచ్చు.

గంటముందు సినిమాహాల్ కు వెళితే అక్కడ కూడా టికెట్లు తీసుకొవచ్చని ప్రభుత్వం చెబుతోంది. ఈమేరకు సినిమాటోగ్రఫీ చట్టంలో చేసిన సవరణలకు శాసనసభ బుధవారం ఆమోదముద్ర వేసింది. టికెట్లను అధిక ధరలకు అమ్మకుండా కట్టడి చేసేందుకు ఆన్‌ లైన్‌ విధానం తెచ్చామని ప్రభుత్వం చెబుతోంది.

వాస్తవానికి ఆన్‌ లైన్‌ టికెట్‌ విధానం ఉండాలని చిత్రపరిశ్రమ ఎప్పటినుంచో ప్రభుత్వాన్ని అడుగుతోంది. కానీ వ్యాపారం మొత్తాన్ని తామే నిర్వహిస్తామని ఇండస్ట్రీకి షాకిచ్చింది జగన్ సర్కారు. ఇక నుంచి ప్రభుత్వమే ఆన్‌ లైన్‌ వ్యాపారం చేస్తుందన్న ప్రకటనతో పరిశ్రమ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేశాక న్యాయపరంగా దాన్ని ఎలా ఎదుర్కొవాలో ఆలోచిస్తామని సినీపెద్దలు చెబుతున్నారు.

కొత్త విధానంతో బడా నిర్మాతలకు ఊహించని షాక్ తగిలింది. సినిమా టికెట్‌ రేట్లను రేపో, మాపో ప్రభుత్వం సవరిస్తుందనీ.... అదనపు ఆటలు, బెనిఫిట్‌ షోలు వేసుకోవడానికి కూడా జగన్‌ సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందన్న ఆశలపై నీళ్లు చల్లింది. ఇపుడిక అదనపు షోలు, బెన్ ఫిట్ షోలకు అవకాశం లేకుండా పోయింది. తొలివారంలో రేట్లు పెంచుకునే చాన్స్ లేదు.

నిర్మాతలు చెప్పే వసూళ్ల లెక్కలకు, ప్రభుత్వానికి జమ అయ్యే పన్ను రాబడికి మధ్య పొంతన లేదనేది ప్రభుత్వ వాదన. అదే ఆన్‌ లైన్‌ టికెట్ల అమ్మకాలతో పన్ను మొత్తం వసూలవుతుందని భావిస్తోంది. సినిమా హాళ్ల డబ్బు పోగేయడం, రెండు మూడు నెలల తర్వాత చెల్లించడం, రుణాలు తెచ్చుకోవడం లాంటి ఆలోచనలేవీ తమకు లేవన్నారు మంత్రి పేర్నినాని.

Tags

Read MoreRead Less
Next Story