ఆంధ్రప్రదేశ్

YSRCP : గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతలకు నిరసన సెగ

YSRCP : గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు నిరసన సెగ తాకుతూనే ఉంది.

YSRCP :  గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతలకు నిరసన సెగ
X

YSRCP : గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు నిరసన సెగ తాకుతూనే ఉంది. మూడేళ్ల తరువాత జనంలోకి వెళ్తున్న నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. దీంతో గడప వరకు వెళ్లకుండానే ఊళ్లు చుట్టి వెళ్లిపోతున్నారు నేతలు. చాలా చోట్ల ప్రజాప్రతినిధులు, వైసీపీ లీడర్లు సైతం గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. నీళ్లు లేక, కరెంటు రాక, రోడ్లు బాగుచేయక, డ్రైనేజీలను బాగుచేయకపోవడంతో స్థానికులు మొహం పట్టుకుని కడిగిపారేస్తున్నారు. దీనికి తోడు బిల్లులు రావడం లేదని, ధరలు మండిపోతున్నాయని, వైసీపీ నేతల దౌర్జన్యాలు, కబ్జాలు మితిమీరుతున్నాయన్న కంప్లైంట్లు కూడా ఇస్తున్నారు. వీటికి ఏం సమాధానం చెప్పాలో తెలియక అక్కడి నుంచి జారుకుంటున్నారు. ఇప్పటి వరకు వెళ్లింది చాటు.. ఇక గడప తొక్కకపోవడమే బెటర్‌ అంటూ చాలా మంది ఇంట్లోనే కూర్చుంటున్నారు.

గడప ముందుకు వచ్చింది సాక్షాత్తు మంత్రి అని కూడా చూడ్డం లేదు. మూడేళ్లలో జరిగిన అభివృద్ధేంటో చెప్పు అంటూ నిలదీస్తున్నారు. జగన్‌ బటన్‌ నొక్కడం తప్ప పథకాల డబ్బులు రావడం లేదని జనం మొత్తుకుంటున్నారు. కొత్తగా రేషన్‌ కార్డులు ఇవ్వడం అన్నదే మరిచిపోయారని, కొత్త పెన్షన్లు ఎప్పుడిస్తారని ప్రశ్నిస్తే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పారిపోతున్నారని జనం డైరెక్టుగానే చెబుతున్నారు. ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి అనూహ్య పరిణామాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కరెంట్‌ బిల్లులు, ఆర్టీసీ ఛార్జీలు, చెత్తపన్ను నుంచి ఇంటిపన్ను వరకు పెంచిన పన్నులను ప్రస్తావిస్తున్నారు. వచ్చే ఆదాయం పిసరంత అయితే పన్నులు కొండంత పిండుతున్నారని చీత్కారాలు పెడుతున్నారు. దీంతో తూతూమంత్రంగా ఒకపూట జనంలోకి వెళ్లి సరిపెడుతున్నారు.

జగన్‌ గెలవాలని ప్రార్థనలు చేస్తే.. గెలిచాక ఒక్క పథకం కూడా అందకుండా చేశాడంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. రేషన్ కార్డు ఇవ్వలేదని, మనవళ్లకు అమ్మ ఒడి రాలేదని, 45 ఏళ్లు దాటిన మహిళలకు ఏడాదికి రావాల్సిన 18వేలు కూడా అందడం లేదని చెబుతోంది.

గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లమని జగన్‌ ఆదేశిస్తే.. ఏకంగా 30 కార్లు, వందల మందిని వెంటేసుకుని వెళ్లారు కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి. సిటీలోని వందల మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలను వెంటపెట్టుకుని, భారీ కాన్వాయ్‌తో కదిరి రూరల్‌ మండలంలోని చలంకుంట్లపల్లి పంచాయతీలోని మూడు గ్రామాల్లో పర్యటించారు. ఏ గడప తొక్కకుండా మందీమార్బలంతో ఎమ్మెల్యే వెళ్లిపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నట్లు ఫొటోలకు ఫోజులు ఇస్తూ తూతూమంత్రంగా గడప గడపకు కార్యక్రమం చేస్తున్నారంటూ స్థానికులు విమర్శించారు.

వైసీపీ నాయకులు గడప గడపకూ అంటూ తమ వద్దకు రావొద్దంటూ... విశాఖ GVMC గాంధీ విగ్రహం దగ్గర దళితులు నిరసన తెలిపారు. దళితులకు సంక్షేమ పథకాలు అందడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ముఖం పెట్టుకుని ఇంటింటికీ వస్తారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు మంత్రులు మా ఇంటికి రావొద్దంటూ తెగేసి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెబుతామని దళిత నాయకులు హెచ్చరించారు.

గడప గడపకు వెళ్లలేం అంటూ అందరూ బహిరంగంగా చెప్పలేకపోతున్నా.. కొందరు మాత్రం ధైర్యంగా ముందుకొస్తున్నారు. అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గడప గడపకు ఎలా వెళ్లగలం అని ప్రశ్నిస్తున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలోని 21వ వార్డు వైసీపీ కౌన్సిలర్ రామారావు నాయుడు డైరెక్టుగా పార్టీ పెద్దలనే ప్రశ్నించారు. ఇందిరమ్మ కాలనీకు 30లక్షలు, నాయుడుకాలనీకు 80లక్షల నిధులు మంజూరైనప్పటికీ.. అభివృద్ధి పనులు జరగలేదన్నారు. కాలనీలో తాగునీరు, కాలువలు, వీధి దీపాలు సమస్య ఉన్న పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES