300 అడుగుల లోయలోకి పడిపోయిన బస్సు.. ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

300 అడుగుల లోయలోకి పడిపోయిన బస్సు.. ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి
బ్రేక్ ఫెయిల్ అవ్వటంతో మూడు వందల అడుగుల లోయలోకి బస్సు పడిపోయింది.

ప్రశాంతంగా కనిపించే విశాఖ అరకు లోయలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు డముకు సమీపంలో బోల్తా పడింది. ఐదో నంబరు మలుపు దగ్గర ప్రమాదం జరిగింది. అరకు పర్యటన ముగించుకుని విశాఖ వస్తున్న సమయంలో బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ అయింది.. వెంటనే లోయలో పడిపోయింది.

ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు, 108 సిబ్బంది హుటాహుటిన క్షతగాత్రుల్ని విజయనగరం జిల్లా ఎస్‌.కోట హాస్పిటల్‌కు తరలించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన వారికి అనంతగిరి, విశాఖ కేజీహెచ్‌ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

అరకు చూసేందుకు హైదరాబాద్ షేక్‌పేట్‌ నుంచి ఒకే కుటుంబానికి చెందిన 26 మంది దినేష్‌ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సులో వెళ్లారు. వీరిలో 19 మంది పెద్దలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. పదో తేదీన అమరావతి, మంగళగిరి చూసుకుని శుక్రవారం ఉదయం అరకు వెళ్లారు. అరకు పర్యటన ముగించుకుని బొర్రా గుహలు చూసి సింహాచలం వెళ్లేందుకు అక్కడ బయల్దేరారు.

తిరుగు పయనం అవుతున్నట్లు సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో బంధువులకు సమాచారం ఇచ్చారు.. అయితే, ఆ తర్వాత కొద్దిసేపటికే వారి ఫోన్లు స్విచ్ఛాఫ్‌ అయ్యాయి. అనంతగిరి మండలం దముకు గ్రామం దాటిన తర్వాత రాత్రి 7 గంటల సమయంలో బ్రేక్ ఫెయిల్ అవ్వటంతో మూడు వందల అడుగుల లోయలోకి బస్సు పడిపోయింది. అయితే, డ్రైవర్‌కు ఘాట్‌ రోడ్డుపై అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.. ఓ వైపు చీకటి పడటం, దారిని అంచనా వేయలేకపోవడంలో డ్రైవర్‌ విఫలమై ఉంటాడని స్థానికులు చెబుతున్నారు.

హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్న స్థానికులు.. క్షతగాత్రుల్ని బస్సులో నుంచి బయటకు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, 108 అంబులెన్స్‌ సిబ్బంది.. సహాయ చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్యపై స్పష్టమైన వివరాలు తెలియడం లేదు. నలుగురు చనిపోయినట్లుగా అధికారులు చెబుతున్నారు. ప్రమాద వివరాల కోసం అధికారులు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు.

అరకు ప్రమాదంపై ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం విషయం తెలియగానే సీఎం కేసీఆర్‌ అక్కడి అధికారులతో మాట్లాడారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. హైదరాబాద్‌ కలెక్టర్ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

అటు అరకు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ప్రమాదం విషయం తెలియగానే ఎంతో బాధపడ్డానంటూ ట్వీట్‌ చేశారు.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి కూడా ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు ఫోన్‌ చేసి మాట్లాడారు.. ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు.. మృతుల కుటుంబాలకు కిషన్‌ రెడ్డి సానుభూతి తెలిపారు. అరకు ఘటనపై తెలుగు రాష్ట్రాల గవర్నర్లు స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story