Purandeswari: ఏపీ ఆర్థిక స్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించండి

Purandeswari: ఏపీ ఆర్థిక స్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించండి
కేంద్రానికి పురంధేశ్వరి విజ్ఞప్తి.... నిర్మలా సీతారామన్‌కు వినతి పత్రం అందజేసిన పురంధేశ్వరి

ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితిని అంచనా వేసేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రితో సమావేశమైన పురందేశ్వరి పలు అంశాలను ప్రస్తావిస్తూ వినతిపత్రం అందజేశారు. అందులోని ప్రధాన అంశాలపై ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది జులై 26 నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్థిక అవకతవకలు, అప్పటి వరకు చేసిన మొత్తం అప్పు 10లక్షల 77 వేల కోట్లు అనే అంశాలను నిర్మలా సీతారమన్ దృష్టికి తీసుకెళ్లినట్లు పురందేశ్వరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక నిర్వహణ తీరు ఇప్పటికీ అలాగే కొనసాగుతోందని వివరించారు. ఏపీ అప్పులపై పార్లమెంటులో అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కొందరు సభ్యులు RBI వద్ద ప్రభుత్వం దాఖలు చేసిన 4 లక్షల 42 వేల కోట్ల అప్పులను మాత్రమే లెక్కలు చెప్పి ఇతర అప్పులను ప్రస్తావించలేదని గుర్తు చేశారు. పార్లమెంటులో ఇచ్చిన ఈ సమాధానాలను అడ్డుపెట్టుకొని... ఏపీ భాజపా ప్రతిష్ట దెబ్బతినేలా వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న అప్పులను భవిష్యత్తులో కట్టలేని తిప్పల నుంచి బయట వేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర భాజపా చేస్తున్న ప్రయత్నాలను.. తప్పుగా చిత్రీకరించారని వివరించారు.


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వినియోగించుకున్న గుత్తేదారులకు, సేవలకు, సప్లయర్లకు, విద్యుత్‌ విక్రయ ఒప్పందాలకు నాలుగేళ్లుగా బకాయిలు చెల్లించలేని దయనీయ స్థితిలోకి తెచ్చారన్నారు. ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని... సకాలంలో చెల్లించక బ్యాంకుల్లో పెద్దఎత్తున బకాయిలు పేరుకుపోయి NPAలు పెరిగిపోతున్నాయనే విషయం గ్రహించాలని కోరారు. ప్రస్తుతం ఏటా ఏపీ సొంత ఆదాయం 90 వేల కోట్లు, కేంద్ర పన్నులలో వాటా 35 వేల కోట్లు కలిపి దాదాపు లక్షా 35 వేల కోట్లుగా ఉందన్నారు. బడ్జెట్ ప్రకారం రాష్ట్ర వ్యయం 2 లక్షల 60వేల కోట్ల రూపాయలు ఉండగా... మిగిలిన లక్షా 25 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, ప్రభుత్వ కార్పొరేషన్ల అప్పుల ద్వారా పక్కకు మళ్లించిన నిధులు సమకూర్చుకోవడం జరుగుతోందన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో బడ్జెట్, అకౌంటింగ్ విధానం అస్తవ్యస్తంగా ఉందన్నారు.

ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్ ద్వారా ఉత్పత్తయ్యే నాణ్యత లేని చీప్ లిక్కర్ తాగడం ద్వారా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా ఆరోగ్యం దెబ్బతింటుందని పురందేశ్వరి నివేదించారు. మద్యం ద్వారా ఏటా 30 వేల కోట్ల రూపాయలను.. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం లెక్కలోకి రాకుండా దారి మళ్లిస్తోందని తెలిపారు. మద్యం ఉత్పత్తి కంపెనీలు, సరఫరా... రాష్ట్ర అధికార వర్గీయుల చేతుల్లో ఉన్నాయని ఆరోపించారు. వినతిపత్రంలో ప్రస్తావించిన అవకతవకలపై విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించే చర్యలు తీసుకోవాలని నిర్మలా సీతారామన్‌ను పురందేశ్వరి కోరారు.

Tags

Read MoreRead Less
Next Story