Chandrababu: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన..

Chandrababu: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన..
ఉల్లిగడ్డకు.. ఆలుగడ్డకు తేడా తెలియని సీఎం

మిగ్‌జాం తుపాను రైతులను కోలుకోలేని దెబ్బతీసిందని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తుకు మానవ తప్పిదాలు తోడుకావడంతో నష్ట తీవ్రత మరింత పెరిగిందన్నారు. పంట కాలువల్లో పూడికలు తీయకపోగా.. రైతులకు గోనె సంచులు కూడా ప్రభుత్వం ఇవ్వలేదని ఆక్షేపించారు. అహంకారంతో వెళ్తే.. ఎలా ఉంటుందో తెలంగాణలో చూశామన్న చంద్రబాబు... మరో 3 నెలల్లో రాష్ట్రంలోనూ అదే చూస్తామని జోస్యం చెప్పారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. మిగ్‌జాం తుపాను వల్ల... గుంటూరు, బాపట్ల జిల్లాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. గుంటూరు జిల్లా నందివెలుగులో... రైతులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులు తీవ్ర ఆవేదన కలిగించాయన్నారు. కౌలు రైతులు మరింత కుదేలయ్యారన్న చంద్రబాబు... ప్రభుత్వం వెంటనే వారిని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.


ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తే, తనలాంటి వాళ్లని కూడా జైల్లో పెడుతున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. చేయని తప్పునకు జైలులో ఉంచినందుకు మానసిక క్షోభ అనుభవించానన్నారు. అంతకుముందు మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడులో రైతులు చంద్రబాబును ఆపి.. గోడు వెళ్లబోసుకున్నారు. మెడకు ఉరితాళ్లు బిగించుకుని వినూత్న నిరసన తెలిపారు. ప్రజల కష్టాలు ఇక మూడు నెలలేనని. చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు. కష్టకాలంలో పొలాల్లో ఉండి రైతు కష్టాలు తెలుసుకోవాల్సిన మంత్రులు ఎక్కడున్నారని నిలదీశారు. పంట నష్టపరిహారం తాను పెంచుకుంటూ వెళ్తే... జగన్ తగ్గించుకుంటూ వచ్చారని మండిపడ్డారు. పంటల బీమా ప్రీమియం కూడా చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.

భోవేమూరు నియోజకవర్గం అమర్తలూరులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉల్లిగడ్డకు, ఆలు గడ్డకు తేడా తెలియని ముఖ్యమంత్రికి రైతు కష్టాలెలా తెలుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల బతుకులు మరాలన్నా, రైతుల కష్టాలు తీరాలన్నా, రాష్ట్రంలో రహదారులు బాగుపడాలన్నా తెలుగుదేశం - జనసేన ప్రభుత్వం రావాలి. రైతుల తరఫున పలు డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచిన చంద్రబాబు. ప్రభుత్వం డిమాండ్లు తక్షణమే పరీష్కరించకుంటే, 3నెలల్లో అధికారంలోకి వచ్చే తెలుగుదేశం - జనసేన ప్రభుత్వo పరిష్కరిస్తుంది. ప్రతీ ఒక్కరినీ ఆదుకునే భరోసా ఇస్తున్నా. తుఫాను వల్ల వరి పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ. 30,000 చొప్పున పరిహారం ఇవ్వాలి. ఆక్వా రైతులకు రూ.50,000, అరటికి రూ. 40,000, చెరకుకు రూ.30,000,ఇవ్వాలి. పత్తి, వేరుశనగకు రూ.25,000, జొన్న, మొక్కజొన్న, అపరాలు, పొద్దుతిరుగుడుకు రూ.15,000, జీడి పంటకు 50,000 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి." అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story