CBN: జగన్‌ను దేవుడు కూడా క్షమించడు

CBN: జగన్‌ను దేవుడు కూడా క్షమించడు
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన... రైతులకు అండగా ఉంటామని భరోసా

రైతు బాధల్ని పట్టించుకోని ముఖ్యమంత్రిని దేవుడు కూడా క్షమించడని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. విపత్తు నష్టం నుంచి ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని కనీసం ప్రధాని మోదీని కూడా జగన్‌ కోరలేదని విమర్శించారు. తెలుగుదేశం-జనసేన గెలుపుతో మార్పునకు నాంది పలకాలన్న చంద్రబాబు రైతు ప్రభుత్వాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రెండోరోజు పర్యటించిన చంద్రబాబు బాపట్ల, పర్చూరు, పత్తిపాడు నియోజకవర్గాల్లో రైతులు, ప్రజలకు జరిగిన నష్టాన్ని పరిశీలించారు. పర్చూరులో రైతులను పరామర్శించి వారి కష్టాలు తెలుసుకున్నారు. అన్నదాతలకు విత్తనాలు ఇవ్వలేని ప్రభుత్వం... రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు వెలుగులోకి తీసుకొచ్చే పత్రికలపైనా అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆక్షేపించారు. అన్నదాతల ఆత్మ బలిదానాలకు సీఎం అసమర్థతే కారణమని మండిపడ్డారు.


ముఖ్యమంత్రి జగన్‌కు ఇసుకపై ఉన్న ప్రేమ రైతులపై లేదని చంద్రబాబు విమర్శించారు. తుపానుపై రైతుల్ని అప్రమత్తం చేస్తే నష్టం తగ్గేదన్నారు. విపత్తు నష్టం నుంచి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కనీసం ప్రధానిని కూడా కోరలేదని మండిపడ్డారు. చెరుకూరు గ్రామం మీదుగా వెళ్తూ పంట నీటమునిగి దిక్కుతోచని స్థితిలో ఉన్న శ్రీనివాసరావు అనే రైతు దంపతులను చంద్రబాబు పలకరించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న 6 ఎకరాల మిరప తోటను పీకేస్తున్న తీరును చూసి చలించిపోయారు. వెంటనే రైతుకు 2 లక్షల సాయాన్ని బాబు ప్రకటించారు. అంతకుముందు బాపట్లలోని ఎస్టీ కాలనీలో పర్యటించిన చంద్రబాబు తుపాను బాధితులకు నిత్యావసరాల కిట్లను పంపిణీ చేశారు. యానాదుల్ని ఆర్ధికంగా పైకి తీసుకొచ్చే బాధ్యతను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. పార్టీ తరఫున ఒక్కో ఇంటికి 5వేల రూపాయల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం రాగానే కాలనీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని భరోసా ఇచ్చారు.


తెలుగుదేశం-జనసేన గెలుపు... మార్పునకు నాంది పలకాలన్న చంద్రబాబు... అధికారంలోకి వచ్చిన వెంటనే నల్లమల డ్రైన్ పూర్తిచేసే బాధ్యత తీసుకుంటామన్నారు. గుంటూరు ఛానల్ ఆధునికీకరిస్తామని హామీ ఇచ్చారు. నష్టపోయామనే అధైర్యంతో అఘాయిత్యాలు చేసుకోవద్దని చంద్రబాబు రైతుల్ని కోరారు. అనంతరం పత్తిపాడు నియోజకవర్గంలోని చిననందిపాడు, పెదనందిపాడులో చంద్రబాబు పర్యటన సాగింది. మిగ్‌జాం తుపాను గాయం నుంచి రైతులు తేరుకోలేకపోతున్నారు. నాలుగైదు రోజులు దాటినా పొలాల్లో నీళ్లు, అన్నదాత కళ్లలో కన్నీళ్లు ఇంకడం లేదు. ఎవర్ని కదిపినా నిండా మునిగామంటూ బోరుమంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story