పంచాయతీ ఎన్నికల్లో పార్టీ శ్రేణుల పోరాటం అభినందనీయం : చంద్రబాబు

పంచాయతీ ఎన్నికల్లో పార్టీ శ్రేణుల పోరాటం అభినందనీయం : చంద్రబాబు
పంచాయతీ ఎన్నికల్లో పార్టీ శ్రేణుల పోరాటం, రాష్ట్ర ప్రజల చొరవ అభినందనీయమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. సమిష్టిగా పోరాడి ఘన విజయం సాధించారన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో పార్టీ శ్రేణుల పోరాటం, రాష్ట్ర ప్రజల చొరవ అభినందనీయమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. సమిష్టిగా పోరాడి ఘన విజయం సాధించారన్నారు. అమరావతిలో టీడీపీ నాయకులతో సమావేశమైన చంద్రబాబు... పంచాయతీ ఎన్నికల స్ఫూర్తితోనే .. మున్సిపల్ ఎన్నికలకు సమాయాత్తం కావాలన్నారు. జగన్ రెడ్డి అరాచకాలను ఎదుర్కొనేందుకు టీడీపీ పార్టీయే ప్రత్యామ్నాయమని అన్నివర్గాల ప్రజలు భావిస్తున్నారని చంద్రబాబు అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికలను ప్రతి ఒక్కరు సవాల్‌గా తీసుకోవాలన్నారు.

ఈ పంచాయతీ ఎన్నికల మాదిరిగా అర్ధరాత్రి ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయడం మున్సిపల్ ఎన్నికల్లో కుదరదన్నారు చంద్రబాబునాయుడు. బలవంతపు ఏకగ్రీవాలు, మైండ్ గేమ్, ప్రలోభాలు, బలవంతపు నామినేషన్ ఉపసంహరణల విషయంలో ప్రజలు, అభ్యర్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందరు కలిసి ముందుకు వెళితే టీడీపీని అడ్డుకోవడం వైసీపీ తరం కాదన్నారు. ప్రభుత్వం తీవ్రస్థాయిలో పన్నులు పెంచడంతో ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల అక్రమాలకు, కృత్రిమ ఇసుక కొరతతో లక్షలాదిమంది భవన నిర్మాణ కార్మికులు అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా స్వామ్యాన్ని, ప్రజలిచ్చిన తీర్పును గౌరవించకుండా వైసీపీ నేతలు, ఆటవికంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడాన్ని వైసీపీ జీర్ణించుకోలేక పోతుందని విమర్శించారు చంద్రబాబునాయుడు. దీంతో టీడీపీ మద్ధతు దారులపై దౌర్జన్యానికి, విధ్వంసాలకు దిగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని మరో బీహార్ లాగా మారుస్తారా అని ప్రశ్నించారు. దాడులు చేస్తాం, హత్యలు చేస్తాం అంటే సహించేది లేదని గట్టిగా తేల్చిచెప్పారు. వైసీపీ చేసే చర్యలకు ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు. అభ్యర్ధికి తెలియకుండా నామినేషన్లు వెనక్కి తీసుకోవడంపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల విషయంలో పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story