CID: ఇన్నర్ రింగ్‌ రోడ్డు దస్త్రాలు దహనం

CID: ఇన్నర్ రింగ్‌ రోడ్డు దస్త్రాలు దహనం
తాడేపల్లి సిట్‌ కార్యాలయంలో దస్త్రాలు దహనం.... హెరిటేజ్‌ పత్రాలు కాల్చేసిన సీఐడీ సిబ్బంది

తాడేపల్లి సిట్ కార్యాలయం ప్రాంగణంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు దస్త్రాలను సీఐడీ సిబ్బంది తగలపెట్టారు. తమ పెద్ద బాస్ ఆదేశాల మేరకే తగలపెడుతున్నామని ఆరాతీసిన స్థానికులకు సమాధానం ఇచ్చారు. తగలపెడుతున్న తీరును తమ పెద్దబాస్ కు సాక్ష్యంగా చూపేందుకు వీడియో కూడా రికార్డింగ్ చేసుకున్నారు. పత్రాలను తగలబెడుతున్న దృశ్యాలను స్థానికులు రికార్డు చేసి తెలుగుదేశం నేతలకు సమాచారం ఇవ్వగాఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కోర్టు పరిధిలో ఉన్న కేసు పత్రాలను తగలబెట్టడంపై మండిపడిన తెలుగుదేశం నేతలు చంద్రబాబును తప్పుడు కేసులో అరెస్టు చేసి, ప్రభుత్వం మారాక ఇబ్బందులు వస్తాయన్న భయంతోనే ఇలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదే అంశంపై ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు.


తాడేపల్లి సిట్ కార్యాలయం ప్రాంగణంలో పలు కాగితాలు తగలపెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తగలపెట్టక ముందు కాగితాలపై హెరిటేజ్ సంస్థ లోగో స్పష్టంగా కనిపించింది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేసినట్లు ఆ కాగితాల్లో ఉంది. వందల కొద్దీ కాగితాలను ఓ సంచిలో తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు వాటికి నిప్పంటించారు. కాగితాలన్నీ పూర్తిగా కాలిపోయేవరకూ అక్కడే ఉన్నారు. కొన్ని కాగితాలు ఎగిరిపోతుంటే కర్రతో వాటిని మంటల్లోకి లాగారు. తగలపెట్టే సమయంలో చంద్రబాబుకు సంబంధించిన పత్రాలివీ అంటూ వారు మాట్లాడుకున్న మాటలు సైతం బయటకు వచ్చాయి.

తాడేపల్లిలోని పాతూరు రోడ్డు సంవృద్ధి నెక్సా అపార్ట్‌మెంటులో సీఐడీ తన సిట్ కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. సీఐడీ అదనపు డీజీ కొల్లి రఘురామరెడ్డి కూడా అందులోనే నివాసం ఉంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీకి చెందిన ఈ అపార్టమెంటులో 200కు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఉదయం 10గంటల సమయంలో కొల్లి రఘురామరెడ్డి సిబ్బంది ఓ సంచి నిండా పలు దస్త్రాలను అపార్ట్మెంట్ ప్రాంగణంలో పడేసి వాటిని తగలపట్టడాన్ని.... అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఇతర కుటుంబాల వారు గమనించారు.


ఎందుకు తగలబెడుతున్నారని ప్రశ్నించగా చంద్రబాబు, హెరిటేజ్‌కి సంబంధించిన దస్త్రాలను పెద్ద బాస్ ఆదేశాల మేరకు పెడుతున్నట్లు ఆ వ్యక్తి స్థానికులకు చెప్పాడు. పూర్తిగా తగలపెట్టిన సాక్ష్యాన్ని కూడా..వీడియో రూపంలో తమ పెద్ద బాస్‌కు పంపేందుకు చిత్రీకరిస్తున్నానని సమాధానం ఇచ్చాడు. వెంటనే స్థానికులు సమీపంలో ఉన్న తెలుగుదేశం నాయకులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని..జరుగుతున్న తతంగాన్ని చిత్రీకరించారు. వీడియోలు తీయొద్దంటూ సీఐడీ సిబ్బంది బెదిరింపులకు దిగారు.

నేరపరిశోధనపై దృష్టిసారించాల్సిన సీఐడీ. క్రైమ్‌ ఇన్వాల్వ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌గా మారిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ధ్వజమెత్తారు. పత్రాలు తగులబెడితే పాపాలు పోతాయా అని ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించి చేసిన తప్పునకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. జగన్ ఆదేశాలతో చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు సిట్ అనేక అక్రమ కేసులు బనాయించిందన్న తెలుగుదేశం నేత ఎన్డీఏ కూటమి గెలుపు పక్కా అని పలు సర్వేలు చెప్పడంతో రఘురామ్ రెడ్డి పత్రాలు తగలబట్టించారని ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం నేతలపై పెట్టిన తప్పుడు కేసులకు సంబంధించిన ఆధారాలనూ..ధ్వంసం చేసే కుట్ర జరుగుతోందని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. సచివాలయం సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రత పెంచాలని వారు డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story