AP CID: దస్త్రాల కాల్చివేతపై సీడీఐ దిద్దుబాటు చర్యలు

AP CID: దస్త్రాల కాల్చివేతపై సీడీఐ దిద్దుబాటు చర్యలు
పేపర్లు అస్పష్టంగా ఉండడం వల్లే కాల్చేశామని ప్రకటన.... ఇప్పటికే కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశామని వెల్లడి

పత్రాలను తగలబెట్టిన వ్యవహారం బయటకు రాగానే తాడేపల్లి సిట్ కార్యాలయానికి పెద్దఎత్తున ఉన్నతాధికారులు చేరుకొని విచారణ చేపట్టారు. ఆ పరిసరాల్లోకి ఎవరినీ అనుమతించలేదు. ఫోన్లలో ఎవరైనా చిత్రీకరించే యత్నం చేస్తే..వారి ఫోన్లు లాక్కుని వీడియోలు తొలగించి అక్కడి నుంచి పంపేశారు. అటు.. హెరిటేజ్ పత్రాల దహనంపై సీఐడీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఫొటో కాపీల మిషన్ వేడెక్కిపోవటం వల్ల కొన్ని పేపర్లు అస్పష్టంగా ప్రింట్ అయ్యాయని, వాటిని కట్ చేసి దహనం చేశామని ప్రకటనలో పేర్కొంది. సీఐడి, సిట్ ఆధ్వర్యంలో ఐదు కేసులకు సంబంధించి విజయవాడ ACB కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశామని తెలిపింది. ఒక్కో అభియోగపత్రంలో 8 నుంచి 10 వేల పేజీలను కోర్టుకు సమర్పించామని పేర్కొంది. ఈ క్రమంలో..లక్షల పేజీల కాపీలు తీయాల్సి వచ్చిందని, ఫొటోకాపీ మిషన్ వేడెక్కడం వల్ల కొన్ని పేపర్లు అస్పష్టంగా ప్రింట్ అయ్యాయని వివరించింది. వాటిని కట్ చేసి దగ్ధం చేశామని తెలిపింది. కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించామని, ఆదాయ పన్నుకు సంబంధించిన పేపర్లను అధికారికంగా తీసుకున్నామని పేర్కొంది. అయితే వ్యర్ధమైన పేపర్లు కాల్చినప్పుడు పత్రికల ప్రతినిధులకు ఎందుకు అనుమతించలేదో సమాధానం చెప్పలేదు.మీడియాలో విజువల్స్ వచ్చాక దహనం చేసిన ప్రాంతంలో ఒక్క పేపర్ కూడా లేకుండా సీఐడీ సిబ్బంది శుభ్రం చేశారు.


తాడేపల్లి సిట్ కార్యాలయం ప్రాంగణంలో పలు కాగితాలు తగలపెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తగలపెట్టక ముందు కాగితాలపై హెరిటేజ్ సంస్థ లోగో స్పష్టంగా కనిపించింది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేసినట్లు ఆ కాగితాల్లో ఉంది. వందల కొద్దీ కాగితాలను ఓ సంచిలో తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు వాటికి నిప్పంటించారు. కాగితాలన్నీ పూర్తిగా కాలిపోయేవరకూ అక్కడే ఉన్నారు. కొన్ని కాగితాలు ఎగిరిపోతుంటే కర్రతో వాటిని మంటల్లోకి లాగారు. తగలపెట్టే సమయంలో చంద్రబాబుకు సంబంధించిన పత్రాలివీ అంటూ వారు మాట్లాడుకున్న మాటలు సైతం బయటకు వచ్చాయి.


తాడేపల్లిలోని పాతూరు రోడ్డు సంవృద్ధి నెక్సా అపార్ట్‌మెంటులో సీఐడీ తన సిట్ కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. సీఐడీ అదనపు డీజీ కొల్లి రఘురామరెడ్డి కూడా అందులోనే నివాసం ఉంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీకి చెందిన ఈ అపార్టమెంటులో 200కు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఉదయం 10గంటల సమయంలో కొల్లి రఘురామరెడ్డి సిబ్బంది ఓ సంచి నిండా పలు దస్త్రాలను అపార్ట్మెంట్ ప్రాంగణంలో పడేసి వాటిని తగలపట్టడాన్ని.... అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఇతర కుటుంబాల వారు గమనించారు.

ఎందుకు తగలబెడుతున్నారని ప్రశ్నించగా చంద్రబాబు, హెరిటేజ్‌కి సంబంధించిన దస్త్రాలను పెద్ద బాస్ ఆదేశాల మేరకు పెడుతున్నట్లు ఆ వ్యక్తి స్థానికులకు చెప్పాడు. పూర్తిగా తగలపెట్టిన సాక్ష్యాన్ని కూడా..వీడియో రూపంలో తమ పెద్ద బాస్‌కు పంపేందుకు చిత్రీకరిస్తున్నానని సమాధానం ఇచ్చాడు. వెంటనే స్థానికులు సమీపంలో ఉన్న తెలుగుదేశం నాయకులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని..జరుగుతున్న తతంగాన్ని చిత్రీకరించారు. వీడియోలు తీయొద్దంటూ సీఐడీ సిబ్బంది బెదిరింపులకు దిగారు.

Tags

Read MoreRead Less
Next Story