ఆంధ్రప్రదేశ్

ఆ విషయాలు బహిరంగపరచడం ముమ్మాటికీ కోర్టు ధిక్కారమే : న్యాయవాదులు

సీజేఐకి ఏపీ సీఎం జగన్‌ లేఖ రాయడం, ప్రెస్‌మీట్‌ పెట్టి ఆ విషయాలు బహిరంగపరచడం ముమ్మాటికీ కోర్టు ధిక్కారమే అని న్యాయవాదులు, న్యాయమూర్తులు అభిప్రాయపడుతున్నారు..

ఆ విషయాలు బహిరంగపరచడం ముమ్మాటికీ కోర్టు ధిక్కారమే : న్యాయవాదులు
X

సీజేఐకి ఏపీ సీఎం జగన్‌ లేఖ రాయడం, ప్రెస్‌మీట్‌ పెట్టి ఆ విషయాలు బహిరంగపరచడం ముమ్మాటికీ కోర్టు ధిక్కారమే అని న్యాయవాదులు, న్యాయమూర్తులు అభిప్రాయపడుతున్నారు. జగన్‌ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. సీజేఐకి రాసిన లేఖను బహిర్గత పరచడాన్ని సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ఖండించింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైంది కాదని తీర్మానం చేసింది. ఇలాంటి చర్యలు న్యాయవ్యవస్థ స్వతంత్రతను తీవ్ర ప్రభావం చేస్తుందని సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అభిప్రాయపడింది. అటు.. న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ జగన్‌ రాసిన లేఖ, అనంతరం నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ను అఖిల భారత న్యాయమూర్తుల సంఘం ఖండించింది. ఏపీ ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నం న్యాయస్థానాలను కించపరిచేదిగా ఉందని, న్యాయ వ్యవస్థను బలహీనపరిచేందుకు అప్రయత్నంగా అభివర్ణిస్తూ తీర్మానం చేసింది. రాజకీయ నాయకులు చేస్తున్న ఈ ఆరోపణలు అనుమానాస్పదమైనవిగా ఆలిండియా జడ్జస్‌ అసోసియేషన్‌ పేర్కొంది. మరోవైపు సీజేఐకి లేఖ రాస్తూ జగన్‌ చేసిన ఆరోపణలను ఎన్‌సీఎల్‌టీ బార్‌ అసోసియేషన్‌ సైతం ఖండించింది.

మరోవైపు జగన్‌ లేఖను ఇప్పటికే బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌ తీవ్రంగా తప్పుపట్టాయి. జగన్ చేసిన ప్రయత్నాలు కోర్టులపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా ఉన్నాయని అభిప్రాయపడ్డాయి. లేఖలోని ఆరోపణలు ఎలాంటి ఆధారాలు లేకుండా అత్యున్నత న్యాయస్థానాల్లోని.. న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించేవిగా ఉన్నాయని పేర్కొన్నాయి. ఇది కోర్టుల స్వతంత్రతను దెబ్బతీయడమే కాకుండా.. కోర్టు ధిక్కారంగా పరిగణించ దగినవని అభిప్రాయపడ్డాయి. తన అవసరాలకు అనుగుణంగా జడ్జిలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నమేనంటూ వ్యాఖ్యానించాయి. న్యాయమూర్తులపై ఒత్తిళ్లు తెచ్చే ప్రయత్నాలు... ఇటీవల చాలా జరుగుతున్నాయని అన్నారు. అయితే ఓ రాష్ట్ర ముఖ్యమంత్రే ఇలాంటి ప్రయత్నం..చేయడం ఆందోళన కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశాయి. న్యాయమూర్తులు తమపై వచ్చిన ఆరోపణలపై బహిరంగంగా స్పందించలేరని.. అందుకే వ్యవస్థ గౌరవాన్ని కాపాడే బాధ్యతను భుజాలకెత్తుకుందని బార్ కౌన్సిల్‌ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌ మనన్‌ కుమార్‌ మిశ్రా స్పష్టం చేశారు. ఇలాంటి కుట్రల్ని చేధించేందుకు దేశవ్యాప్తంగా న్యాయవాదులు ముందుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.

మరోవైపు.. ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ సెక్రెటరీకి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం కలకలం రేపుతోంది. సీజేఐకి సీఎం జగన్ రాసిన లేఖను ఖండించినందున కాళ్లు విరగ్గొడతాం.. అంటూ బెదిరించారని ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ సెక్రెటరీ అభిజాత్ తెలిపారు. లండన్ నుంచి ఫోన్ చేసి తనను, సహచర న్యాయవాదులను బెదిరించినట్టు ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు అభిజాత్. నువ్వు ఎవరితో పెట్టుకున్నావో తెలుసా అంటూ బెదిరించారని ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి బెదిరింపు కాల్స్‌తో తన భావప్రకటన స్వేచ్ఛకి... విధి నిర్వహణకు భంగం కలిగించినట్టేనన్నారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. ఇదే తరహా బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చినట్లు బార్ అసోసియేషన్ ట్రెజరర్ కూడా చెప్పారు.

Next Story

RELATED STORIES