AP: జోరుగా కోడి పందేలు, జూదం

AP: జోరుగా కోడి పందేలు, జూదం
ఏపీలో అధికార పార్టీ నేతల నేతృత్వంలో బరులు.... ఉభయ గోదావరి జిల్లాల్లో రెండురోజూ జూరుగా పందేలు...

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా కోడి పందేలు, జూదం, గుండాటలు జోరుగా సాగుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో బరులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాల జోరు రెండో రోజూ కొనసాగుతోంది. ఏలూరు నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ విస్తృతంగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున బరులు సిద్ధం చేసి భారీగా పందాలు నిర్వహిస్తుండగా పందాలు చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున పందెం రాయుళ్లు తరలి వస్తున్నారు. ఏలూరు జిల్లా దెందులూరు, పెదపాడు, పెదవేగి, కైకలూరు, ఉంగుటూరు మండలాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, పెదఅమిరం, ఉండి, ఆకివీడు ప్రాంతాల్లో జోరుగా కోడి పందాలు సాగుతున్నాయి. కోడి పందాలకు తోడు బరుల వద్దే భారీ స్థాయిలో పేకాట, గుండాట, కోత ముక్క శిబిరాలు నిర్వహిస్తున్నారు. కోడి పందాలు వేయకూడదని సుప్రీంకోర్టు ఆంక్షలు విధించినా వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు. అనధికారికంగా అందరికీ తెలిసే కోడి పందాల తంతు సాగుతున్నా అటు పోలీసు, ఇటు రెవెన్యూ అధికారులు ఏ మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తూ చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు.


పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, తేతలి, దువ్వ, ఇరగవరం, వేల్పూరు, తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం, సూర్యారావు పాలెం, ముప్పవరం ప్రాంతాల్లో పందేలు జోరుగా సాగుతున్నాయి. గుండాటలు, జూదం ఆడేవాళ్లతో బరులన్నీ కిక్కిరిసిపోయాయి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో 18 బరుల్లో కోడి పందేలు, గుండాటలు నిర్వహిస్తున్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో.. కోడిపందేల బరులు వద్ద పోలీసులు ఉదయం హడావిడి చేసి.... టెంట్లు తొలగించారు. అయితే అధికార పార్టీ నేతల ఒత్తిడితో వెనుదిరిగారు. పందేం రాయుళ్లు మళ్లీ టెంట్లు వేసి యథావిధిగా ఆటలు కొనసాగించారు. మొదటి రోజు రెండు జిల్లాల్లో కలిపి 70 నుంచి 80 కోట్ల వరకు నగదు చేతులు మారినట్లు అంచనా. రెండో రోజూ వంద కోట్లకుపైగా డబ్బు చేతులు మారొచ్చని అంచనా వేస్తున్నారు.


కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం అంపాపురంలో జాతీయ రహదారి పక్కనే కోడి పందేలు, పొట్టేలు పోటీలు జరుగుతున్నాయి. కోడి పందేల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. పామర్రు నియోజకవర్గంలో ప్రధాన రహదారుల పక్కనే బరులు ఏర్పాటు చేయగా పందేం రాయుళ్లు పెద్ద ఎత్తున పందేలు కాస్తున్నారు. వైకాపా MPమోపిదేవి వెంకటరమణ ఇలాఖా బాపట్ల జిల్లా నిజాంపట్నంలో భారీగా బరులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ కార్యాలయాల వద్ద కూడా జూదం, గుండాట ఆడుతున్నారు. అధికారులు అటువైపు వెళ్లకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం ముస్సాపురం, అమరావతి మండలం ఉంగుటూరులో భారీగా కోడి పందేలు నిర్వహిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story