Editorial: "ఎంపీ లావు కృష్ణదేవరాయలను వణికిస్తున్న వైసీపీ కట్టప్పలు ఎవరు"?

Editorial: ఎంపీ లావు కృష్ణదేవరాయలను వణికిస్తున్న వైసీపీ కట్టప్పలు ఎవరు?
ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఉక్కిరిబిక్కిరి; రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేక వర్గం; పార్టీ మారుతారు, పోటీ చేయరంటూ ప్రచారం; వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రానివ్వకుండా పావులు; సొంతనేతలే గోతులు తీయడంపై లావు మనస్తాపం


నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు కృష్ణ దేవరాయలుకి అటు పల్నాడు జిల్లాలో, ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా కొన్ని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారట. చివరికి పార్టీలతో సంబంధం లేని కొందరు సీనియర్ రాజకీయ నేతలు కూడా ఇలానే ప్రశ్నలు అడుగుతున్నారట. కొన్ని సందర్భాల్లో ఎంపీ లావు కృష్ణ దేవరాయలు చిరాకు పడుతూ ఇబ్బందులు సైతం ఎదుర్కొంటున్నారట. ఆ ప్రశ్నలేంటంటే... మీరు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి.. ఎక్కడి నుండి పోటీ చేయబోతున్నారు. మీరు ఉన్న వైసీపీలోనే ఉంటారా లేక మరో పార్టీలోకి వెళతారా. మీ పార్లమెంట్ పరిధిలోని కొందరు ఎమ్మెల్యేలు మీకు అస్సలు సహకరించడం లేదట నిజమేనా. అనే ప్రశ్నలు అడగటమే సమస్యకి అసలు కారణమట.

ఇలా అందరూ అడుగుతుంటే ఎలాగో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మనం కూడా ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకుంటే మంచిదని ఎంపీ లావుకి సన్నిహితులు కూడా చెప్పారట. ఇలాంటి పుకార్లు ఎవరు ఎక్కడ నుంచి పుట్టిస్తున్నారా తెలుసుకుందాం అని CMO ఆఫీస్ లో తనకి అత్యంత సన్నిహితంగా ఉండే ఇద్దరు అధికారులను కలిసి రహస్యంగా విచారణ చేయమని సున్నితంగా కోరారట. పనిలో పనిగా తనకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న ఒక ఇంటలిజెన్స్ DSP స్థాయి అధికారితోనూ రెండో నివేదిక తెప్పించుకున్నారట. ఈ రెండు నివేదికలు చూసి బిత్తరపోవడం లావు కృష్ణ వంతైందట. తనని వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా పోటీ నుంచి తప్పించాలని... ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక మహిళా మంత్రి, ఒక రాజ్యసభ సభ్యుడు పల్నాడు జిల్లాలో ఉన్న ముగ్గురు సొంతపార్టీ ఎమ్మెల్యేలు గట్టిగా పట్టుబడుతున్నారట. ఇది తెలుసుకొని వెంటనే సీఎం జగన్ కి అత్యంత సన్నిహితంగా ఉండే సజ్జల రామకృష్ణరెడ్డితో పాటు పార్టీలో ఉన్న మరో సీనియర్ నేతని కలిశారట. తాను పోటీ అంటూ చేస్తే నరసరావుపేట ఎంపీగా మాత్రమే చేస్తా. అనుకోని పరిస్థితులు ఎదురైతే తప్ప నిర్ణయంలో ఎలాంటి మార్పులు ఉండవని తెగేసి చెప్పారట. సొంతపార్టీ నేతలే గోతులు తవ్వడంపై అత్యంత దగ్గరి బంధువుల వద్ద తన బాధని చెప్పుకుని బాధపడ్డారట లావు కృష్ణ దేవరాయులు. ఒకానొక దశలో వైసీపీలో కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారని మధనపడిన సందర్భం కూడా వచ్చిందట.

ఇక ఇటీవల వినుకొండ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా ఎంపీ బ్యానర్లు కట్టనివ్వకుండా హైడ్రామానే నడిచింది. చివరికి ఎంపీ గారి వ్యక్తిగత కార్యదర్శి జోక్యం చేసుకొని అర్ధరాత్రి మూడు గంటల వరకు ఫోన్ లు చేసి మాట్లాడితే గాని ఎంపీ బ్యానర్లు వినుకొండలో కట్టడానికి అనుమతి దొరకని దుస్థితి. అంటే వినుకొండ నియోజకవర్గంలో ఎంపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఆ ఎంపీ ప్రోద్భలంతో తన బ్యానర్లు కట్టనివ్వకుండా అడ్డుకున్నారని కృష్ణదేవరాయలు అనుకూల వర్గం వారు చెబుతున్నారు.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ సీటు తమ కుటుంబంలో ఎవరో ఒకరికి కేటాయించాలని ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఇప్పటికే మూడుసార్లు సీఎం జగన్ ని కలిసి చెప్పారట. ఈ విషయంలో సీఎం జగన్ కూడా కొంత సానుకూలoగా స్పందించడం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీట్ లేదా నరసరావుపేట పార్లమెంట్ లో ఎదో ఒక అసెంబ్లీ సీట్ గ్యారెంటీ అనే నమ్మకంతో ఉన్నారు. ఇక ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని తమ ఎంపీని కావాలని పార్టీ నుంచి బయటకు వెళ్ల గొట్టాలని అందులోనూ సొంత పార్టీలోని వాళ్లే చూడటం కృష్ణ దేవరాయలు అనుకూల వర్గానికి ఏమాత్రం మింగుడు పడటం లేదట. పార్టీలతో సంబంధం లేకుండా పల్నాడు జిల్లాలో లావుకి ప్రతి గ్రామంలో అభిమానులు, సొంత అనుచరులు ఉన్నారు. లావు ప్రధాన అనుచరులయితే అస్సలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఇంటలిజెన్స్ అధికారి ఇచ్చిన నివేదికలో పార్టీ మారినా గెలుపు ఖాయమని చెప్పడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారట. అవసరం అయితే వచ్చే ఎన్నికల్లో పార్టీ మారైనా సరే నరసరావుపేట నుంచే బరిలోకి దిగి గెలవాలని గట్టి ధీమాతోనే ఉన్నారట.రాబోయే రోజుల్లో ఈ కథ మొత్తం ఎన్ని మలుపులు తిరుగుతుందో కాలమే సమాధానం చెప్పాలి.

Tags

Read MoreRead Less
Next Story