AP: సూపర్ సిక్స్‌ వివరిస్తూ ప్రచారం

AP: సూపర్ సిక్స్‌ వివరిస్తూ ప్రచారం
దూసుకుపోతున్న కూటమి అభ్యర్థులు.... క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం

చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమంటూ ఎన్డీయే అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నియోజకవర్గంలోని ముఖ్యనేతలు, పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ ప్రచార దూకుడు పెంచుతున్నారు. రాష్ర్ట అభివృద్ధిని కాక్షించే ప్రతిఒక్కరూ కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటించి భారీ మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.


రాష్ట్ర అభివృద్ధిని ఆకాక్షించే ఎన్డీయేను... వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని రాజంపేట లోక్‌సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి కోరారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జనసేన అభ్యర్థి రామాంజనేయులు ఆధ్యర్వంలో బలిజల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కులమతాలకు అతీతంగా అభివృద్ధి జరగాలంటే కూటమి అధికారంలోకి రావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. చిత్తూరులో కూటమి అభ్యర్థి గురజాల జగన్మోహన్‌ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వంగవీటి రాధా పాల్గొన్నారు. భారీ కార్ల ర్యాలీతో RL కళ్యాణ మండపంలో నిర్వహించిన బలిజ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలోని బలిజ, కాపు, ఒంటరి కులస్థులు ఎన్డీయే వెంటే ఉన్నారని తెలిపారు. కూటమి అభ్యర్థులు అఖండ విజయం సాధించి మళ్లీ సుపరిపాలన తీసుకొస్తారని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి బండారు శ్రావణి ప్రచార దూకుడు పెంచారు. ఇంటింటికీ తిరిగి సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కూటమి గెలుపు కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుతూ అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ తెదేపా నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్‌గోపాల్ రెడ్డి, ప్రభాకర్ చౌదరి, పార్లమెంటు అభ్యర్థి అంబికా లక్షీనారాయణ... ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జగన్‌ పాలనలో ఇబ్బందిపడిన పార్టీ శ్రేణులకు అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామన్నారు. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరులో వైకాపా జడ్పీటీసీ అనూష సహా 500 వైకాపా కుటుంబాలు... నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. సూపర్‌ సిక్స్‌ పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే సైకిల్‌ ఎక్కినట్లు తెలిపారు.

ఎన్డీయేకు మందకృష్ణ మాదిగ మద్దతు ప్రకటించడంతో అవనిగడ్డ కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ను ఆ పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బాపట్ల జిల్లా మేదరమెట్ల పంచాయితీ పరిధిలోని సోమవరప్పాడులో స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ప్రచారం నిర్వహించారు. పర్చూరు కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు... అద్దంకి నాంచారమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలకు తెలిపారు. అనంతరం బొమ్మల సెంటర్‌లోని ఓ టీ దుకాణం వద్ద స్వయంగా టీ తయారు చేసి అందరికి అందించారు. కనిగిరి మండలం నందన మారేళ్లలో ఒంగోలు కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, స్థానిక తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్థులకు సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరిస్తూ ఓట్లు అడిగారు. ఈ క్రమంలోనే పలువురు వైకాపా శ్రేణులు మాగుంట ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు

Tags

Read MoreRead Less
Next Story