AP: ఏ వీధిలో చూసిన కూటమి జెండాలు.. సూపర్‌ సిక్స్‌ నినాదాలు

AP: ఏ వీధిలో చూసిన కూటమి జెండాలు.. సూపర్‌ సిక్స్‌ నినాదాలు
ఎండలను లెక్క చేయకుండా అభ్యర్థుల ప్రచారం... కూటమి అభ్యర్థులకు బ్రహ్మరథం

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడితో వేసవి వేడి చిన్నబోతోంది. 40 డిగ్రీల పైబడిన ఎండలను సైతం లెక్కచేయకుండా అభ్యర్థులు ఊరువాడా జోరుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఏ వీధిలో చూసినా కూటమి జెండాలు, సూపర్‌-6 నినాదాలే వినిపిస్తున్నాయి. అలుపెరగకుండా ప్రచారం సాగిస్తున్న కూటమి అభ్యర్థులకు పలుచోట్ల మహిళలు మంగళ హారతులతో బ్రహ్మరథం పట్టారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్‌కు మద్దతుగా ఆయన భార్య, కుమారుడు నగరంలో ప్రచారం నిర్వహించారు. మైలవరం కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన సతీమణి శిరీష నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జి.కొండూరు, ఇబ్రహీంపట్నంలో స్థానిక పార్టీ నాయకులు, మహిళలతో కలిసి పలు వార్డుల్లో ప్రచారం చేపట్టారు. N.T.R జిల్లా తిరువూరులో కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానిక సమస్యలను వంద రోజుల్లో పరిష్కరిస్తామని భరోసానిచ్చారు.


శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌... కుమ్మరవాండ్లపల్లి, ఎగువపల్లి గ్రామాల్లో ప్రతి గడపనూ పలకరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని పడుగుపాడులో ప్రచారం నిర్వహించిన కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి... అవినీతి రహిత పాలన కోసం కూటమిని గెలిపించాలని కోరారు. తిరుపతిలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చింతా మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలకు ఆకర్షితులై పెద్దసంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశంలో చేరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 30 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య వీరికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. Y.S.R జిల్లా కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో 120 కుటుంబాలు వైసీపీ వీడి తెలుగుదేశంలో చేరాయి. అనంతపురంలో కూటమి అభ్యర్థి పోతుల నర్సింహులు సమక్షంలో 50 కుటుంబాలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నాయి. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో కాట్రేనికోన, తాళ్లరేవు మండలాలకు చెందిన 100 మంది వైకాపా కార్యకర్తలు సైకిలెక్కారు.

Tags

Read MoreRead Less
Next Story