AP: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

AP: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
రాజకీయ పార్టీ అభ్యర్థులకు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా కీలక ఆదేశాలు

సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగిన వేళ ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలపై పార్టీల ఆనవాళ్లు ఉండటానికి వీల్లేదన్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు నుంచి ఓటర్ కార్డులు, భద్రతపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నామని తెలిపారు. కోడ్ అమల్లోకి వచ్చిందన్న మీనా... నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన సందర్భంగా ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా ప్రజలకు సూచనలు, అభ్యర్థులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 4 కోట్ల 7 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు మీనా తెలిపారు. అందులో పురుషులు 2 కోట్ల మంది, మహిళలు 2 కోట్ల 7 లక్షల మంది ఉన్నట్లు తెలిపారు. 3 వేల 482 మంది థర్డ్ జెండర్‌ ఓటర్లు, 7603 మంది ఎన్‌ఆర్‌ఐలు ఉన్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 46 వేల 165 పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు. ఎన్నికల్లో 4 లక్షల మంది ఉద్యోగులను వినియోగిస్తున్నామని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రత పెంచుతామన్నారు.


ఈవీఎంలు, వీవీప్యాట్‌లను ఇప్పటికే పరీక్షించామని మీనా వెల్లడించారు. ఇకపై ఫాం -7లు వినియోగించేందుకు అనుమతించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయలపై పార్టీ గుర్తులు, ఫోటోలు, హోర్డింగులు ఉండటానికి వీల్లేదని మీనా స్పష్టం చేశారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనటానికి వీల్లేదన్నారు.ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమైన అధికారులు, అధికారయంత్రాంగం బదిలీలపై పూర్తి నిషేధం అమలు అవుతుందని... ఈసీ స్పష్టం చేసింది. మంత్రులతో... అధికారుల వీడియో కాన్ఫరెన్సులపైనా పూర్తి నిషేధం వర్తిస్తుందని ఈసీ తేల్చిచెప్పింది. అభివృద్ధి, నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను సమర్పించాల్సిందిగా ఆయా ప్రభుత్వ విభాగాలను.. ఎన్నికల ప్రధానాధికారి ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక లబ్ధిదారులకు ఇచ్చే పత్రాలపై సీఎం ఫొటోలు ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే మంత్రులకు... ప్రభుత్వ అధికారిక వాహనాల వినియోగం నిలిపివేయాలని ఆదేశించారు.


పైలట్ కార్లు, సైరన్ వినియోగించకూడదని షరతులు విధించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అతిథి గృహాలను ఖాళీ చేయించాలని వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఈసీ తేల్చి చెప్పింది. సర్వీసు నిబంధనల్ని ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదవుతాయని హెచ్చరించింది. ఈమేరకు అన్ని ప్రభుత్వ శాఖలు, HODలు, కలెక్టర్లు, డీజీపీ, ఎస్పీలకు... ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మార్గదర్శకాలు జారీ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story