AP: ఓట్ల తొలగింపు పని వైసీపీ నేతలదే

AP: ఓట్ల తొలగింపు పని వైసీపీ నేతలదే
ఓట్ల అక్రమాలపై ఏపీ వ్యాప్తంగా 70 కేసులు.... ఇందులో అత్యధిక కేసులో వైసీపీ నేతలపైనే..

ఆంధ్రప్రదేశ్‌లో తటస్థులు, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులు, మద్దతుదారుల ఓట్ల తొలగింపునకు తప్పుడు ధ్రువీకరణలు, సమాచారంతో ఫాం-7 దరఖాస్తులు చేసిందీ, చేయించిందీ వైసీపీ నేతలేనని స్పష్టమైంది. ఎన్నికల అధికారుల ఫిర్యాదుల మేరకు.. తప్పుడు ఫాం-7ల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 10 జిల్లాల్లోని 13 నియోజకవర్గాల్లో 70 కేసులు నమోదయ్యాయి. వాటిలో అత్యధిక కేసుల్లో వైసీపీ నేతలే నిందితులు. వారిని వెనక నుంచి నడిపిస్తున్నదెవరు అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోతోంది..


గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఫాం-7 దరఖాస్తుల కుట్రలో,... 42వ డివిజన్‌ వైసీపీ ఇంఛార్జి చల్లా శేషారెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. ఆయనతో పాటు... వైసీపీ బూత్‌ ఏజెంట్లుగా పనిచేస్తున్న కొండా శేషారెడ్డి, ఎల్‌.రాము, వైసీపీ నాయకుడు పులుసు వెంకటరెడ్డి, సిద్ధి వెంకాయమ్మలపై పట్టాభిపురం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. మూడు రోజుల్లో 979 మంది ఓట్ల తొలగింపునకు వారు నకిలీ ఫాం-7లు పెట్టారు. అందులో 939 మంది అర్హులేనని విచారణలో తేలింది. తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అర్హుల ఓట్ల తొలగింపునకు గతంలో వైసీపీ ఇంఛార్జిగా వ్యవహరించిన దువ్వాడ వాణి వ్యక్తిగత కార్యదర్శి చింతాడ సాయికుమార్‌తోపాటు. వైసీపీ నాయకులు ఏదూరు రాజశేఖర్‌, వాన రాము, కణితి మురళి... నకిలీ ఫాం-7లు పెట్టారు. 60కు పైగా పోలింగ్‌ కేంద్రాల్లో ఓట్ల తొలగింపునకు వీరు వందల ఫాం-7 దరఖాస్తులు పెట్టడంతో నందిగాం, కోటబొమ్మాళి పోలీసుస్టేషన్‌లలో మోసం , ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 31ఏ కింద వీరిపై రెండు కేసులు నమోదయ్యాయి.


కాకినాడ నగర నియోజకవర్గంలో నకిలీ ఫాం-7లకు సంబంధించి 23 కేసులు నమోదయ్యాయి. వీటిలో 50 మందికి పైగా నిందితులుంటే ఎక్కువమంది వైసీపీ కార్యకర్తలే. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో అధికారపార్టీ ముఖ్యనేత ఆధ్వర్యంలోనే...తప్పుడు దరఖాస్తుల దందా సాగింది. పది కేసులు నమోదైనా ఒక్క దానిలోనూ కీలకనేతను నిందితుడిగా చేర్చలేదు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఫాం-7 దరఖాస్తుల దాఖలుపై టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికల సంఘం అధికారులు కొందరు వైసీపీ నాయకులపై ఫిర్యాదు చేశారు. 16 కేసులు నమోదైనా.. అక్రమాలకు కారణమైన అరాచక అధికారపార్టీ నేత పేరే చేర్చలేదు. ఇలా తప్పుడు దరఖాస్తులు చేసింది వైసీపీ వారేనని తేలినా ఆ పార్టీ పెద్దలు, ముఖ్యుల్ని విచారించకుండా పోలీసులు తాత్సరం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కేసులు నమోదుచేశారే తప్ప నిందితులైన ఏ ఒక్క వైసీపీ నాయకుడినీ పోలీసులు విచారించలేదు. అరెస్టూ చేయలేదు.

Tags

Read MoreRead Less
Next Story