NDA: ప్రచారంలో దూసుకుపోతున్న ఎన్డీఏ అభ్యర్థులు

NDA: ప్రచారంలో దూసుకుపోతున్న ఎన్డీఏ అభ్యర్థులు
జగన్‌ అరాచకాలను ఎండగడుతూ ప్రచారం... టీడీపీ-జనసేనలోకి భారీ చేరికలు

ఆంధ్రప్రదేశ్‌లో NDA అభ్యర్థుల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. జగన్‌ ప్రభుత్వ అరాచకాలను ఎండగతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేయబోయే కార్యక్రమాలు, పథకాలపై ప్రచారం చేస్తున్నారు. వారికి ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. చాలా నియోజకవర్గాల్లో అధికార వైసీపీ నుంచి తెలుగుదేశం, జనసేనలోకి చేరికలు పెరిగాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి అనే మాట లేకుండా చేస్తామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. సీఎం నివాసం వద్ద తాగునీటి సమస్య ఉన్నా చర్యలు లేవని మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వజ్ర రెసిడెన్సీ అపార్ట్ మెంట్ వాసులతో లోకేష్ సమావేశమయ్యారు. స్థానిక సమస్యలను అపార్ట్ మెంట్ వాసులు లోకేష్ కు వివరించారు.


ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు పెరిగాయి. గుండాలపేటకు చెందిన వైసీపీ సర్పంచ్ జగదీశ్వరితో పాటు వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. వారికి తెదేపా అభ్యర్థి పూసపాటి అదితి గజపతిరాజు కండవా వేసి.... పార్టీలోకి ఆహ్వానించారు. మెంటాడ మండలం ఇప్పలవలసలోనూ వైకాపా నుంచి జనసేనలోకి 300 కుటుంబాలు చేరాయి. జనసేన నేత శివశంకర్‌ ఆధ్వర్యంలో వారంతా పార్టీలో చేరారు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో మీట్‌-గ్రీట్‌ కార్యక్రమాన్ని ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత పాల్గొన్నారు. రానున్న పదేళ్లలో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని పెమ్మసాని అన్నారు.


పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నరసరావుపేట తెదేపా ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయులు, కన్నాలక్ష్మీనారాయణ సమక్షంలో పలువురు వైసీపీ నేతలు... తెలుగుదేశం పార్టీలో చేరారు. వైకాపా అరాచక పాలనకు అంతం పలికేందుకు... కూటమి విజయానికి అందరూ కృషి చేయాలని లావు శ్రీకృష్ణదేవరాయులు పిలుపునిచ్చారు. కడపలో తెలుగుదేశం అభ్యర్థి మాధవి ముమ్మరంగా ప్రచారం చేశారు. రవీందర్‌నగర్‌కు చెందిన పలువురు ప్రజలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ ఆమె కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి.... కార్యకర్తలతో కలిపి జోరుగా పర్యటించారు. వివిధ కాలనీల్లో పర్యటిస్తూ... వారి సమస్యలను తెలుసుకుని ముందుకు సాగారు.

Tags

Read MoreRead Less
Next Story