ఏపీలో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఏపీలో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
భారీ వర్షాలతో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వర్షాలు, వరదలకు భారీ నష్టం జరిగింది. వరద బాధితులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు..

భారీ వర్షాలతో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వర్షాలు, వరదలకు భారీ నష్టం జరిగింది. వరద బాధితులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న భారీ వరదతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. లోతట్టు ప్రాంతాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, ఔటు ఫ్లో 5 లక్షల 25 వేల క్యూసెక్కులుగా ఉంది.

ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలో కృష్ణా నది వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రజలు.. బిక్కుబిక్కుమంటూ పునరావాస కేంద్రాల్లోకి తరలివెళ్లారు. జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, అనపర్తి నియోజకవర్గాల్లో పంటనష్టం భారీగా ఉంది. చేతికి అందివచ్చిన పంట అకాల వర్షాలకు దెబ్బ తినడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఏలేరు వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో అధికంగా వస్తున్న నేపథ్యంలో 12వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో ఏమాత్రం తగ్గకపోవడం, రిజర్వాయర్‌లో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరింది. వరద నీటితో కాలువలన్నీ ఉప్పొంగడంతో వరదనీరు ఎక్కడికక్కడ పంటపొలాలను ముంచెత్తుతుంది. ఏలేరు వరదనీరు గొల్లప్రోలు బైపా‌స్‌లో బ్రిడ్జికి సమాంతరంగా ప్రవహిస్తోంది.

అనంతపురం జిల్లా మడకశిర మండలం కల్లుమరి వద్ద హంద్రీనీవా కాల్వకు గండిపడింది. కొన్ని రోజులుగా కాలువ గట్టు నుంచి నీరు లీకేజీ అవుతోందని అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవడంతోనే వరదలతో కాలువకు గండిపడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం... క్రమంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల పాటు కోస్తాలో పలుచోట్ల వర్షాలు, కొన్ని చోట్ల ఏపీలో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలోనూ పలు చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story