వైసీపీలో రచ్చకెక్కిన వర్గపోరు

వైసీపీలో రచ్చకెక్కిన వర్గపోరు

ఏపీలో రివర్స్‌ పాలనే కాదు.. అధికార పార్టీ నేతలు కూడా రివర్స్‌ గేర్‌లోనే నడుస్తున్నారు.. విపక్ష పార్టీల నేతలతో ఘర్షణలు కొట్లాటలు ఎక్కడైనా కామన్‌.. కానీ ఏపీలో మాత్రం మొత్తం రివర్స్‌లో ఉంది. ఆధిపత్యం కోసం ఆ పార్టీ నేతలే బహిరంగంగా ఘర్షణలకు దిగుతున్నారు. ఒకరా.. ఇద్దరా.. ఇలా గొడవల పడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.

కాకినాడలో జరిగిన జిల్లా సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. టిడ్కో ఇళ్ల విషయంలో అవినీతి జరిగిందని పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపించగా.. టీడీపీ హయాంలోనే జరిగిందంటూ ఎమ్మెల్యే ద్వారంపూడి ఫైర్ అయ్యారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యేలు చినరాజప్ప, జోగేశ్వరరావు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో జోగేశ్వరరావును ద్వారంపూడి పక్కకు తోసేశారు. ఇది సరైన పద్థతి కాదంటూ చంద్రబోస్ సూచించగా.. ఆయనను ద్వారంపూడి దుర్భాషలాడారు. దీంతో సమావేశం అర్ధంతరంగా ముగిసింది.

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం సమీపంలో మంత్రి బొత్స సత్యనారాయణకు వైసీపీ కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలింది. బెంగళూరు నుంచి కల్యాణదుర్గం వస్తుండగా మార్గమధ్యలో వైసీపీ ఎంపీ తలారి రంగయ్య వర్గీయులు బొత్స వాహనాన్ని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఉషా చరణ్‌శ్రీ తమను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఉషా చరణ్‌శ్రీ కూడా బొత్స వాహనంలోనే కూర్చుని ఉన్నారు. ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని బొత్సకు ఫిర్యాదు చేశారు.

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యంపై ప్రజలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రోడ్ల దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జగనన్న సరికొత్త పథకం.. రోడ్డు గుంతలు.. నడ్డి విరుగుడు అంటూ ఓ ఫ్లెక్సీ రూపొందించారు. రోడ్ల పరిస్థితిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. అధికారులు, నాయకుల నుంచి కనీస స్పందన రావడం లేదంటూ.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొత్తానికి ఓవైపు వైసీపీ నేతల మధ్య వర్గ పోరు రోజురోజు తీవ్ర స్థాయికి చేరుతుండగా.. మరోవైపు ప్రజల నుంచి వైసీపీ ప్రభుత్వ పాలనపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది.



Tags

Read MoreRead Less
Next Story