YCP: జగన్‌ పాలనలో సాగునీటి రంగం నిర్వీర్యం

YCP: జగన్‌ పాలనలో సాగునీటి రంగం నిర్వీర్యం
గొట్టా బ్యారేజ్‌ను గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వం... కనీస మరమ్మతులు చేయని జగన్‌ సర్కార్‌

జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి రంగం నిర్వీర్యమైంది. కొత్త ప్రాజెక్టుల మాట దేవుడెరుగు ఉన్నవాటిపైనే జగన్ పగబట్టి ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేశారు. వందల గ్రామాలకు తాగునీరులక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ... జలసవ్వళ్లతో గలగలలాడే గొట్టా బ్యారేజ్... వైసీపీ సర్కారు నిర్లక్ష్యానికి బలైపోయింది. నిధులు మంజూరు కాక... కనీస నిర్వహణ లేక.... గొట్టా బ్యారేజ్ ప్రమాదంలో పడింది. దీనికితోడు బ్యారేజ్‌లో పూడిక పెరిగిపోయి పొలాలకు నీరు అందడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో ఎంతో కీలకమైన గొట్టా బ్యారేజ్‌ను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. ఐదేళ్లుగా రూపాయి విడుదల చేయలేదు కనీసం మరమ్మతులు చేపట్టలేదు. ఫలితంగా వరద పోటు తీవ్రతకు డౌన్ స్ట్రీమ్ యాప్రాన్ చెల్లాచెదురైంది. ఎడమ ప్రధాన కాలువ గేట్లు పూర్తిగా దెబ్బతిని నీరు వృధాగా పోతుంది. గేట్లకు కనీసం గ్రీజు కూడా పెట్టలేదు. గతంలో 30 మందికి పైగా సిబ్బంది ఉంటే ప్రస్తుతం ముగ్గురు మాత్రమే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సర్కార్ చేతకానితనంతో గొట్టా బ్యారేజ్ ఉనికే ప్రమాదంలో పడింది.

ఏటా వర్షాలు వచ్చినప్పుడల్లా గొట్టా బ్యారేజ్‌కు వరద ముప్పు పొంచి ఉంటుంది. ప్రమాదాన్ని తట్టుకునేలా గత ప్రభుత్వాలు చర్యలు చేపట్టేవి. ఇందులో భాగంగా డౌన్ స్ట్రీమ్ యాప్రాన్ పనులకు 2017లో తెలుగుదేశం ప్రభుత్వం 9కోట్ల 72 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో బ్యారేజ్‌కు గ్రహణం పట్టింది. వైకాపా పాలనలో పనులు ముందుకు సాగలేదు. 2022లో 12.2 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపినా ఫలితం లేదు. గతంలో చేసిన పనులకు గుత్తేదారుకు ఇప్పటివరకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

బ్యారేజ్‌లో పూడికతీత పనులు సాగకపోవడంతో..... నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. శివారు పంటలకు నీరందక రైతులు నష్టపోతున్నారు. బ్యారేజ్ పైన ఉన్న రోడ్డు గుంతలమయంగా మారి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా తక్షణమే బ్యారేజ్ మరమ్మత్తులు చేపట్టి నదీ పరివాహక ప్రజలను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు

Tags

Read MoreRead Less
Next Story