Ys Jagan: అడ్రస్ లేని జిల్లాకో విమానాశ్రయం

Ys Jagan: అడ్రస్ లేని జిల్లాకో విమానాశ్రయం
ఉన్న సర్వీసులే రద్దు అంటూ మండిపడుతున్న ప్రజలు

మాటల్లో విమానాశ్రయాలు కడితే.. చేతలు కూల్చేశాయి అన్నట్లుంది జగన్‌ ప్రభుత్వ పరిస్థితి. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. అన్ని జిల్లాలో ఒకే విధంగా విమానాశ్రయాలు ఉండాలి. బోయింగ్‌ విమానాలు సైతం ల్యాండ్‌ అయ్యేలా రన్‌వే అభివృద్ధి చేయాలి అని చెప్పారు. బోయింగ్‌ వంటి భారీ విమానాలు కాకున్నా.. 200 సీటింగ్‌ ఉండే విమానాలైనా వస్తాయని ప్రయాణికులు ఎదురు చూశారు. కొత్తగా జిల్లాల్లో విమానాశ్రయాలు నిర్మించడం మాట ఎలాగున్నా.. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన భోగాపురం, దగదర్తి విమానాశ్రయాలనూ 5 ఏళ్ల జగన్‌ పాలనలో పూర్తి చేయలేకపోయింది.

గత ప్రభుత్వం ప్రారంభించిన కర్నూలు విమానాశ్రయాన్ని మళ్లీ ప్రారంభించి.. గతంలో శంకుస్థాపన చేసిన భోగాపురం విమానాశ్రయానికి మళ్లీ శంకుస్థాపన చేసి తమగొప్పగా చెప్పుకుంటూ జగన్‌ ప్రభుత్వం 5 ఏళ్లు గడిపేసింది. కొత్తగా ఒక్క విమానాశ్రయాన్ని నిర్మించింది లేదు. కనీసం ప్రతిపాదనలు రూపొందించిందీ లేదు. వివిధ రాష్ట్రాలు, దేశాలకు కొత్త సర్వీలు నడిపేలా విమానయాన సంస్థలను ఒప్పించడానికి చేసిన ప్రయత్నం చేయలేదు. ఇప్పటికే నడుస్తున్న సర్వీసులు రద్దు చేసుకుని విమానయాన సంస్థలు పలాయనం చిత్తగించేలా చేయడమే జగన్‌ సర్కార్‌ ఘనత. ఈ ప్రభావం ఎంతో కొంత పారిశ్రామిక, ఐటీ రంగాలపై పడింది.

గత ప్రభుత్వ హయాంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసి 2వేల 700 ఎకరాల్లో నిర్మించాలని ప్రతిపాదించారు. అందుకు అవసరమైన భూసేకరణ, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి.. విమానాశ్రయ నిర్మాణానికి GMR సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సీఎం హోదాలో చంద్రబాబు శంకుస్థాపన సైతం చేశారు. 2019 ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు నాలుగేళ్లపాటు విమానాశ్రయ నిర్మాణ ప్రతిపాదన పక్కనపెట్టింది. ఆ తర్వాత అప్పటి టెండరు ప్రకారమే అదే GMR సంస్థకు నిర్మాణ పనులు చేపట్టడానికి అనుమతులు ఇచ్చింది. గతంలో చంద్రబాబు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుకే.. మరోసారి సీఎం జగన్‌ మే 3న శంకుస్థాపన చేశారు. తెదేపా హయాంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును అలాగే కొనసాగించి ఉంటే రెండేళ్ల కిందటే తొలిదశ నిర్మాణం పూర్తయ్యేది. ప్రజలకు విమాన సేవలు అందుబాటులోకి వచ్చేవి.

నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయానిది మరో గోడు. వైకాపా అధికారంలోకి వచ్చిన మొదట్లో దగదర్తి విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జగన్‌ అధికారులను ఆదేశించారు. అంతలోనే ఏమైందో ఏమో? దగదర్తిలో విమానాశ్రయ నిర్మాణ ప్రతిపాదనను రద్దు చేశారు. తెట్టు దగ్గర రన్‌ వే అంటూ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. రామాయపట్నం పోర్టు.. దానికి అనుసంధానంగా ఏర్పాటు చేసే పారిశ్రామిక పార్కుకు దగ్గరగా విమానాశ్రయం ఏర్పాటు చేస్తే సరకు రవాణాకు ఉపయోగపడుతుందని గత ప్రభుత్వం దగదర్తిలో విమానాశ్రయ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. 1,350 ఎకరాలను సేకరించి సిద్ధంగా ఉంచిన ఆ ప్రాజెక్టును వైకాపా సర్కార్‌ పక్కనపెట్టింది.

Tags

Read MoreRead Less
Next Story