AP: అంగన్వాడీల సమ్మెపై జగన్ ఉక్కుపాదం

AP: అంగన్వాడీల సమ్మెపై జగన్ ఉక్కుపాదం
సమ్మెను అణచివేసేందుకు తీవ్ర యత్నాలు.... అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి దాష్టీకం...

సమస్యల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మెను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అణచివేసేందుకు యత్నిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం సాయంతో రాష్ట్రవ్యాప్తంగా పలు అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టారు. పౌష్టికాహార నిల్వలను సచివాలయాలకు తరలించారు. అధికారుల దుందుడుకు చర్యలపై అంగన్వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాళాలు పగులకొట్టిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని పోలీసు స్టేషన్ల వద్ద ఆందోళన చేశారు. సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కి సమ్మె కొనసాగిస్తుండగానే... అధికార యంత్రాంగం అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టి.. పౌష్టికాహార నిల్వలను, అంగన్వాడీ కేంద్రాల బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగిస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, రామవరప్పాడు, ప్రసాదంపాడులోని అంగన్వాడీ కార్యాలయాల తాళాలు పగులగొట్టి అధికారులు, సచివాలయ సిబ్బంది లోపలికి ప్రవేశించారు. పెనుగంచి ప్రోలులో అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలకొడుతున్నారన్న సమాచారంతో అంగన్వాడీ కార్యకర్తలు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వం కక్ష గట్టి తాళాలు పగలగొట్టించడం సరైన చర్య కాదని హెచ్చరించారు.


అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలకొట్టడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద కార్యకర్తలు నిరసన తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందే పల్లె మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల తాళాలను డిప్యూటీ తహశీల్దార్ ఆధ్వర్యంలో బద్దలు కొట్టారు. సరుకుల నిలువలను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతపురం జిల్లా నార్పల మండలం మసీదు కట్ట కాలనీలో అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె విరమించబోమని తేల్చి చెప్పడంతో అధికారులు రెండు అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలకొట్టారు. ఉరవకొండలో తాళాలు పగలకొట్టిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఉరవకొండ - గుంతకల్లు రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం, తాడిమర్రిలో సచివాలయ, గ్రామ పంచాయితీ అధికారులు.. అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగులకొట్టి వాటి స్థానంలో కొత్తవి వేశారు.


ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో 52అంగన్వాడీ కేంద్రాలను తెరిచేందుకు అధికారులు ప్రయత్నించగా స్థానికులు, అంగన్వాడీ సిబ్బంది అడ్డుకున్నారు. ప్రకాశం జిల్లాలోని కనిగిరి, పామూరు మండలాల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను సచివాలయ సిబ్బంది తాళాలు పగలకొట్టి తెరిచారు. స్థానికులు, అంగన్వాడీ కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగారు. తాళాలు పగలకొట్టడం ఏ మాత్రం సమంజసం కాదని.. దొంగలు చేసే పని సచివాలయ ఉద్యోగులు చేస్తున్నారని మండిపడ్డారు. రెండు రోజులుగా తిండి తిప్పలు లేకుండా సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి కనికరం కూడా లేదని... మార్కాపురంలో అంగన్వాడీ కార్యకర్తలు కన్నీటి పర్యంతమయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story