AP: పన్నుల మోతతో జగన్‌ సర్కార్‌ రికార్డు

AP: పన్నుల మోతతో జగన్‌ సర్కార్‌ రికార్డు
పాత బకాయిల వసూలుకు ప్రజలకు తాఖీదులు... మండిపడుతున్న ప్రజలు

పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జగన్‌ ప్రభుత్వం పన్నుల మోత మోగించడంలో రికార్డు సృష్టిస్తోంది. ఇళ్ల నుంచి సేకరిస్తున్న చెత్తపై వినియోగ రుసుముల వసూళ్లను... కొద్ది నెలలుగా నిలిపేసిన పట్టణ, స్థానిక సంస్థలు మరోసారి విజృంభిస్తున్నాయి. పాత బకాయిలు సహా వసూలు చేసేందుకు సిద్ధమై ప్రజలకు తాఖీదులిస్తున్నాయి. వినియోగ రుసుముల వసూళ్లను మొదటి నుంచీ పట్టణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించలేదు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చినపుడల్లా కొద్ది నెలలపాటు రుసుముల వసూలును ఆపేసి, తర్వాత మళ్లీ పాత బకాయిలతో కలిపి పిండుకుంటున్నారు. 3 వేల రూపాయల వినియోగ రుసుములు చెల్లించాలని విజయవాడలో ఒక కుటుంబానికి నగరపాలక సంస్థ తాజాగా తాఖీదు ఇచ్చింది.


2021 డిసెంబరు నుంచి 2023 డిసెంబరు దాకా నెలకు 120 చొప్పున 25 నెలలకు 3 వేల రూపాయలు చెల్లించాలని అధికారులు అందులో సూచించారు. 2021 అక్టోబరు నుంచి 42 పురపాలక, నగరపాలక సంస్థల్లో ఇళ్లు, దుకాణాలు, వ్యాపార సంస్థల నుంచి చెత్త సేకరించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీని వల్ల ఏటా 165 కోట్ల రూపాయలు వసూలు చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వినియోగ రుసుముల్ని కట్టించుకునే క్రమంలో పట్టణ స్థానిక సంస్థల అధికారులు...ప్రజలు, వ్యాపారుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. రుసుముల్ని చెల్లించడం లేదని కర్నూలులో దుకాణాల ముందు... చెత్త తరలించే వాహనాల్ని నిలిపి ఉంచడం, చెత్త వేయడం వంటి ఘటనలు జరిగాయి. కొన్నిచోట్ల పింఛన్‌ మొత్తాల నుంచి రుసుముల్ని మినహాయించిన సందర్భాలూ ఉన్నాయి. ఎన్నికలు సమీపించడంతో 8 నుంచి 10 నెలలుగా... ప్రత్యేకించి ఇళ్ల నుంచి వినియోగ రుసుముల వసూళ్లను... తాత్కాలికంగా నిలిపివేశారు.

అయితే చెత్త సేకరణ ఆటోలు సరఫరా చేసిన ప్రైవేట్‌ ఏజెన్సీల ఒత్తిడితో... ప్రజల నుంచి మళ్లీ పాత బకాయిలు సహా... పట్టణ స్థానిక సంస్థలు మరోసారి రుసుముల్ని వసూలు చేస్తున్నాయి. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు సచివాలయాల ఉద్యోగుల ద్వారా అధికారులు తాఖీదులిస్తున్నారు. విశాఖ, కాకినాడ, నెల్లూరు, కర్నూలులోనూ వసూళ్లకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తున్న పట్టణ స్థానిక సంస్థలకు ఒక ప్రైవేట్‌ సంస్థ 2,900 ఆటోల్ని సరఫరా చేసింది. ఒక్కో ఆటోకు నెలకు 53 వేల 500 నుంచి 63వేల రూపాయల దాకా అద్దె చెల్లించాలనే ఒప్పందం ఉంది. దీనికోసం 15.50 కోట్ల రూపాయలు చెల్లించాలి. ప్రభుత్వ పెద్దలకు సన్నిహితంగా ఉన్న ప్రైవేట్‌ సంస్థ నిర్వాహకులు ఒత్తిడి చేయడంతో మళ్లీ ప్రజల్ని బాదేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story