AP, TG: తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ

AP, TG: తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ
ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ... అనేక దేవాలయాల్లో జ్వాలా తోరణం కార్యక్రమం

కార్తిక పౌర్ణమి వేళ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున కార్తీక దీపారాధనలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనేక దేవాలయాల్లో జ్వాలా తోరణం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలి వచ్చి పూజలు చేశారు. పూజలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. తిరుమల శ్రీవారి అలయంలో కార్తికదీపోత్సవం వైభవంగా జరిగింది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు, నివేదనలు పూర్తైన తరువాత దీపోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. శ్రీశైల మహా క్షేత్రం కార్తిక మాసోత్సవ వేడుకలతో సందడిగా మారింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దీపారాధనలు నిర్వహించారు. నంద్యాల జిల్లా మహానందిలో వైభవంగా జ్వాలా తోరణం, కోటి దీపాలను వెలిగించారు. కోటి కార్తిక జ్యోతులతో విజయవాడ ఇంద్రకీలాద్రి దేదీప్యమానంగా వెలుగొందింది. కార్తిక పౌర్ణమి సందర్భంగా దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.


పల్నాడు జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో కార్తికపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీత్రికోటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, వివిధ నైవేద్యాలతో అభిషేకాలు జరిపారు.అనంతరం అంగరంగ వైభవంగా జ్వాలా తోరణం నిర్వహించారు. అన్నవరం దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. జ్వాలా తోరణం వెలిగించి... అనంతరం స్వామి, అమ్మవార్లని ఘనంగా ఊరేగించారు.


బాపట్ల జిల్లా అద్దంకిలో శ్రీ గంగా,పార్వతి సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకపూజలు,అభిషేకాలు నిర్వహించారు. అమరావతి మహిళలు కృష్ణా నదిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలంటూకృష్ణమ్మకు హారతులు ఇచ్చారు.


అనకాపల్లి జిల్లా జానకిరాంపురం శివాలయంలో లక్ష దీపారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో గోస్తని నదీ తీరాన ఉన్న శ్రీసిద్ధేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పల్నాడు జిల్లా అమరావతిలోని అమరేశ్వరస్వామి దేవస్థానంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


కర్నూలులోని పలు దేవాలయాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో దీపాలు వెలిగించారు. నెల్లూరులోని ఇరుకళ పరమేశ్వరి ఆలయంలో కార్తిక దీపోత్సవం వైభవంగా జరిగింది.శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలోని త్రిలింగేశ్వర ఆలయంలో జ్వాలాతోరణం వెలిగించారు. అనంతపురంలో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story