KRMB: తెలంగాణకు ఎనిమిదిన్నర టీఎంసీల జలాలు

KRMB: తెలంగాణకు ఎనిమిదిన్నర టీఎంసీల జలాలు
సాగర్‌లోని 14 టీఎంసీలను తెలుగు రాష్ట్రాలకు కేటాయించేలా కేఆర్‌ఎంబీ ప్రతిపాదనలు

తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ కేటాయింపులు చేసింది. నాగార్జునసాగర్‌లో ఉన్న 14 టీఎంసీల్లో తెలంగాణకు ఎనిమిదిన్నర టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు ఐదున్నర టీఎంసీలు కేటాయించింది. నీటి ఎద్దడి కనిపిస్తున్న దృష్ట్యా ఉన్న జాలలను చాలా పొదుపుగా వాడుకోవాలని నిర్ణయించారు. మే నెలలో సమావేశమై అప్పటి పరిస్థితుల దృష్ట్యా ముందుకెళ్లాలని తీర్మానించారు. నాగార్జునసాగర్ జలాశయంలో 500 అడుగులపైన ఉన్న 14 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. అందుబాటులో ఉన్న 14 టీఎంసీలలో తెలంగాణకు 8.5, ఆంధ్రప్రదేశ్‌కు 5.5 టీఎంసీల నీరు వినియోగించుకోవాలని నిర్ణయించారు. కేఆర్ఎంబీ సభ్యకార్యదర్శి డీఎం రాయిపురే నేతృత్వంలో హైదరాబాద్ జలసౌధలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి పాల్గొన్నారు.


జంట జలాశయాలు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో కొద్దిపాటి నీరు ఉన్న నేపథ్యంలో జూన్ వరకు జాగ్రత్తగా తాగునీటి అవసరాల కోసం వాడుకునే విషయమై సమావేశంలో చర్చించారు. అక్టోబర్‌లో తీసుకున్న నిర్ణయాలు, ప్రస్తుత అవసరాలపై చర్చ జరిగింది. అప్పట్లో ఏపీకి 45, తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయించగా... అందులో తమకు మరో ఐదు టీఎంసీల మిగులు ఉందని, తెలంగాణ అదనంగా ఏడు టీఎంసీలు వినియోగించుకొందని ఏపీ ఈఎన్సీ పేర్కొన్నారు. సాగర్ నుంచి వెంటనే తమకు ఆ ఐదు టీఎంసీల నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ కృష్ణా జలాల్లో ఎక్కువ మొత్తాన్నే వినియోగించుకొందని, అంతా లెక్కలోకి రాలేదని తెలంగాణ ఈఎన్సీ అనిల్ పేర్కొన్నారు. శ్రీశైలం నుంచి ఏపీ... ఏ అవసరాలకు కూడా నీరు తీసుకోకుండా చూడాలని కోరారు.

సాగర్ దిగువన తాగునీటికి తమకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, ట్యాంకర్లతో నీరు సరఫరా చేయాల్సిన స్థితి ఉందని ఏపీ ఈఎన్సీ తెలిపారు. సాగర్ కుడికాల్వ నుంచి వీలైనంత ఎక్కువ నీరు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌లోపాటు నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల పరిధిలో ఎక్కువ మంది తాగునీటి కోసం సాగర్‌పైనే ఆధారపడ్డారని తెలంగాణ ఈఎన్సీ వివరించారు. హైదరాబాద్ జనాభాను పరిగణలోకి తీసుకొని తాగునీటి కోసం ఎక్కువ మొత్తం కేటాయించాలని కోరారు. నాగార్జునసాగర్‌లో 500 అడుగులపై ఉన్న 14 టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాలకు కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మే నెలలో త్రిసభ్య కమిటీ మరోమారు సమావేశం కావాలని సమావేశంలో నిర్ణయించారు.

Tags

Read MoreRead Less
Next Story