KTR: కారు సర్వీసింగ్‌కు పోయింది.. షెడ్డుకు కాదు

KTR: కారు సర్వీసింగ్‌కు పోయింది.. షెడ్డుకు కాదు
బీఆర్‌ఎస్‌ కార్యానిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌.... పదేళ్లు పార్టీని పట్టించుకోలేదని అంగీకారం...

ఎన్నికల్లో ఓటమితో కారు సర్వీసింగ్‌కు పోయింది తప్ప.. షెడ్డుకి కాదని బీఆర్‌ఎస్‌ కార్య నిర్వహక అధ్యక్షుడు KTR వ్యాఖ్యానించారు. పదేళ్లు పాలనపై దృష్టిసారించి పార్టీని పట్టించుకోలేదన్న ఆయన అందుకు పూర్తి బాధ్యత తనదేనని తెలిపారు. ఎక్కువ ఎకరాలు ఉన్న వారికి రైతుబంధు ఇవ్వడాన్ని చిన్న రైతులు ఒప్పుకోలేదన్న కేటీఆర్‌.. కొందరికే దళితబంధు రావడంతో మిగతావారు వ్యతిరేకమయ్యారని భువనగిరి పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశంలో తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో తమను ఓడించి..ప్రజలు తప్పు చేసినట్లు కొందరు నేతలు మాట్లాడటం సరికాదని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్.. పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. ఉద్యమం నుంచి రెండు శాసనసభ ఎన్నికల్లో... అదే ప్రజలు బీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టారని మరవకూడదని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఓటమి.. బీఆర్‌ఎస్‌కు కొత్త కాదని.. కేవలం స్పీడ్‌ బ్రేకర్‌ వంటిదేనని KTR స్పష్టంచేశారు. తెలంగాణ భవన్‌లో భువనగిరి లోక్‌సభ నియోజకర్గ సన్నాహక సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఓటమితో కారు సర్వీసింగ్‌కు పోయింది తప్ప.. షెడ్డుకి కాదని వ్యాఖ్యానించారు. పదేళ్లపాటు విరామం లేకుండా పనిచేసిన కారు మరింత వేగంగా పనిచేసేందుకు సర్వీసింగ్‌కు వెళ్లిందన్నారు.


ఈ పదేళ్లు పరిపాలన మీద దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదని.. అందుకు పూర్తి బాధ్యత తనదేనని KTR వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కేంద్రంగా... పార్టీని నడపడం సరికాదని తెలిసిందని పేర్కొన్నారు. పదేళ్లలో కార్యకర్తల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోలేదని.. కొందరికే దళితబంధు రావడంతో... మిగతావారు వ్యతిరేకమయ్యారన్నారు. దళితబంధుపై ఇతర కులాల్లోనూ వ్యతిరేకత కనిపించిందని పేర్కొన్నారు. ఎక్కువ ఎకరాలు ఉన్న వారికి రైతుబంధు ఇవ్వడాన్ని.. చిన్న రైతులు ఒప్పుకోలేదని తెలిపారు. పథకాల వల్ల ప్రజల్లో తలెత్తబోయే వ్యతిరేక ప్రభావాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడం వల్లే వ్యతిరేక ఫలితాలు వచ్చినట్లు విశ్లేషణలో తేలిందని సమావేశంలో కేటీఆర్‌ కార్యకర్తలకు వివరించారు.


బీఆర్‌ఎస్‌ ఎన్నటికీ బీజేపీకి బీ-టీమ్‌ కాదని పునరుద్ఘాటించిన కేటీఆర్‌.. ఆ పార్టీతో పొత్తు గతంలో లేదు.. భవిష్యత్‌లో ఉండబోదని స్పష్టంచేశారు. బీఅర్‌ఎస్‌కు బీజేపీ బీ టీమ్‌ అయితే.. కవితపై కేసు పెట్టేదా అని ప్రశ్నించారు. కవిత అరెస్టు కాకపోవడానికి కారణం బీజేపీతో సంబంధాలు కాదన్న KTR... సుప్రీంకోర్టు జోక్యం వల్లే అరెస్టుకాలేదని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై బీఆర్‌ఎస్‌ను దెబ్బతీయాలని చూశాయని విమర్శించిన ఆయన.. ఆ రెండు పార్టీల బంధానికి ఎమ్మెల్సీ నోటిఫికేషన్‌ నిదర్శనమని వ్యాఖ్యానించారు. అమిత్ షాను రేవంత్‌ కలవగానే.. ఎమ్మెల్సీ ఉపఎన్నికల పద్ధతి మారిందని వివరించారు. రెండు ఎమ్మెల్సీలకు వేర్వేరుగా పోలింగ్‌ జరిగేలా నోటిఫికేషన్ ఇచ్చారన్న ఆయన... ఆ విషయంపై హైకోర్టుకు వెళ్లినా నిరాశే మిగిలిందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story