రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లోకి శ్రీవారి సొమ్ము?

రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లోకి శ్రీవారి సొమ్ము?

ఏడుకొండల వాడి సొమ్ముపై జగన్‌ సర్కారు కన్ను పడిందా? టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి... సర్కారు సేవలో తరించేందుకు రంగం సిద్ధం చేశారా?. టీటీడీ చరిత్రలోనే మొదటిసారి శ్రీవారి సొమ్ములను రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టాలని నిర్ణయించడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. తద్వారా స్వామి నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు దారులు తీసినట్టు తెలుస్తోంది. వెంకన్న సొమ్ము ప్రభుత్వం చేతిలో భద్రంగా ఉండదనే ఆందోళన అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది.

టీటీడీ ఆధ్వర్యంలో నడిచే సేవా ట్రస్టులకు చెల్లించే విరాళాలను వడ్డీ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని టీటీడీ పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అప్పులు చేస్తూ బండిలాగుతున్న సర్కారుకు తమదైన సాయం చేయాలని తీర్మానించినట్టు టీటీడీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీన జరిగిన బోర్డు సమావేశంలోనే తీర్మానం చేసినా... విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచారని తెలుస్తోంది. డిసెంబరులో ప్రణాళికను అమలు చేయడమే లక్ష్యంగా టీటీడీ అడుగులు వేస్తోందని సమాచారం.

టీటీడీ సొమ్ముల్ని కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడిగా పెడితే, గరిష్ఠంగా 7 శాతం వడ్డీ వస్తుందని టీటీడీ అకౌంట్స్‌ విభాగం సూచించింది. ఈ మేరకు టీటీడీ ఫైనాన్స్‌ కమిటీ ఆగస్టు 13న తీర్మానం చేసింది. ఈ ఏడాది డిసెంబరులో భారీ ఎత్తున డిపాజిట్ల కాల పరిమితి ముగుస్తోంది. అందువల్ల, అక్టోబరు లేదా నవంబర్‌లో జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి అని సూచించింది. కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో డిపాజిట్‌ చేయాలని సిఫారసు చేయాలని మాత్రమే ఫైనాన్స్‌ కమిటీ తెలిపింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు అనే పదాన్నికొత్తగా చేర్చినట్టు సమాచారం.

డిసెంబర్‌లో భారీ ఎత్తున టీటీడీ ఎఫ్‌డీలు మెచ్యూర్‌ అవుతున్నాయి. వాటిని రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల్లోకి మళ్లించడమే తరువాయి అని తెలుస్తోంది. ఒకవేళ ఇలాంటి నిర్ణయం ఏదైనా ఆచరణలోకి వస్తే... ఆలయ నిధుల్ని ప్రభుత్వానికి మళ్లించిన ఘనత మొట్టమొదటిసారిగా ఏపీ సర్కారుకే దక్కుతుంది.

టీటీడీ అన్నదానం, బర్డ్‌, గోసంరక్షణ ట్రస్టుల రోజువారీ కార్యకలాపాలు వడ్డీ సొమ్ములతోనే నడుస్తున్నాయి. అందువల్ల, అధిక వడ్డీ కోసం సెక్యూరిటీలలో సొమ్ము డిపాజిట్‌ చేయాలనే కారణం చూపుతున్నట్టు తెలుస్తోంది. వెరసి... రోజు వారీ కార్యకలాపాలకు వడ్డీయే దిక్కు అని టీటీడీయే చెబుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. నెలకోసారి లేదా మూడు నెలలకోసారి వడ్డీ డబ్బులు చేతికందితేనే మేలు. ఆ వెసులుబాటు బ్యాంకు డిపాజిట్లకే ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల కనీస కాలావధి 5 సంవత్సరాలు. గరిష్ఠంగా 40 ఏళ్లు! సర్వసాధారణంగా సెక్యూరిటీలలో 15 సంవత్సరాలు డిపాజిట్‌ చేస్తారు. వీటిపై మధ్యలో వడ్డీ చెల్లించే వెసులుబాటు ఉండదు. పూర్తికాలపరిమితి ముగిసిన తర్వాత ఒకేసారి వడ్డీతో కలిపి డబ్బులు ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో 15 - 20 సంవత్సరాలకు పెట్టుబడి పెట్టారనుకుంటే... అవి మెచ్యూరిటీ అయ్యేనాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో... సొమ్ములు ఎంత మేరకు భద్రమో అని భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story