మంత్రి పదవిలో కొనసాగేందుకు పావులు కదుపుతున్న కొడాలి నాని

మంత్రి పదవిలో కొనసాగేందుకు పావులు కదుపుతున్న కొడాలి నాని
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు శాసనసభ్యుడుగా ఎంపికయ్యారు కొడాలి నాని. మొదట్లో టిడిపి వ్యవస్ధాపకులు దివంగత నేత..

కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు శాసనసభ్యుడుగా ఎంపికయ్యారు కొడాలి నాని. మొదట్లో టిడిపి వ్యవస్ధాపకులు దివంగత నేత NTR కుటుంబం పట్ల వీరవిధేయత చూపిన కొడాలి నాని ప్రస్తుతం ఆ విధేయతను వైయస్ కుటుంబానికి షిఫ్ట్ చేశారు. టిడిపిలో రాజకీయ అక్షరాభ్యాసం చేసిన నాని.. వైసిపిలో అమాత్య పదవి స్ధాయికి ఎదిగారు. టిడిపిలో అక్షరాభ్యాసం చేసినా, వైసిపిలో అమాత్య పదవి పొందినా అందుకు కొడాలి నాని ప్రయోగించిన ఏకైక ఆయుధం విధేయత. ఆ విధేయత అస్త్రంతోనే రాజకీయాల్లో అనేక నిచ్చెనలు ఎక్కిన కొడాలికి.. ఇప్పుడు అదే పెద్దగండంగా మారిందనేది ఏపీలో టాక్ ఆఫ్ ది పాయింట్ గా మారింది. విధేయత శృతి మించడంతో మంత్రికి ఇలాంటి విపత్కర పరిస్ధితి ఎదురయ్యింది అని అటు స్వపక్షీయులు, ఇటు విపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్‌లో కుల సమీకరణాల్లో భాగంగా కమ్మ సామాజిక వర్గ కోటాలో కొడాలి నానీని మంత్రి పదవి వరించింది. అమాత్య పదవి దక్కడానికి అర్హత కంటే విధేయతే ఎక్కువ ప్రభావం చూపిందనే ఆరోపణలు మొదట్లోనే వ్యక్తమయ్యాయి. వైసీపీలో కమ్మ సామాజిక వర్గం నుంచి కొడాలి నానితోపాటు, వసంత కృష్ణప్రసాద్, బొల్లా బ్రహ్మనాయుడు, నంభూరి శంకరరావు, అన్నాబత్తుని శివకుమార్, కఠారి అబ్బయ్య చౌదరి వంటి నేతలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. రాజకీయ అనుభవం పరంగా వీళ్లలో కొందరు మంత్రి పదవి రేసులో కొడాలి కంటే ముందు నిలిచినప్పటికీ, వీరందరికంటే విధేయత అనే అస్త్రం కొడాలి నానికి బ్రహ్మాస్త్రంగా మారింది. జగన్ కేబినెట్‌లో పౌరసరఫరాల శాఖా మంత్రిగా అందలం ఎక్కించింది. అయితే తన కేబినెట్‌లోని 90 శాతం మంత్రుల పదవి కాలం రెండున్నర సంవత్సరాలేనని తరువాత కొత్తవారికి అవకాశం కల్పిస్తానని ఆదిలోనే జగన్ స్పష్టం చేశారు. దీంతో అయిదు సంవత్సరాలు ఉండే 10శాతం జాబితాలో చోటు కోసం మంత్రులలో పోటీ నెలకొంది. తమ పనితీరుతో ముఖ్యమంత్రిని మెప్పించాలని ప్రయత్నాలు ప్రారంభించారు.

ఐదేళ్లు పూర్తిగా మంత్రి పదవిలో కొనసాగాలని కొందరు మంత్రులు ఇప్పటికే ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. ఈ జాబితాపై అందరికంటే ముందే కొడాలి నాని దృష్టి పెట్టినట్లున్నారు. అందరికి భిన్నంగా పనితీరు కంటే.. బూతు సాహిత్యాన్నే అస్త్రంగా ఎంచుకున్నారు. దీనిలో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబునాయుడుతోపాటు ఇతర టిడిపి నేతలపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. అమ్మ మొగుడు వంటి అన్ పార్లమెంటరీ పదాలు కొడాలి నాని పదకోశంలో సహజ వ్యాఖ్యాలుగా మారిపోయాయి. మంత్రి పదవి ప్రతిష్టని దిగజార్చే విధంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు విపక్షాలతోపాటు సామాన్యప్రజలలోనూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కానీ స్వపక్షంలో మాత్రం శభాష్ అనే ప్రసంశలు దక్కాయనే ప్రచారం సాగుతుంది. కొడాలి భాషను సవరించుకోవాలనే హెచ్చరికలు పార్టీ నుంచి రాకపోవడమే దీనికి ఉదాహారణ అనే విపక్షాలు అంటున్నాయి. స్వపక్షంలో నుంచి అందుతున్న ప్రోత్సాహాంతో రెచ్చిపోయిన ఆయన ఏపీలో బూతులకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు. ప్రస్తుతం అమాత్యులకు జగన్ ఇచ్చిన గడువు రెండున్నరేళ్ళలో సగానికి పైగా కాలం పూర్తయింది. దీనితో మరోసారి తన పాండిత్యానికి పదును పెట్టే అవకాశం కోసం చూస్తున్న నానీకి ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు, తిరుమల డిక్లరేషన్ వంటి అంశాలు కలిసి వచ్చాయి. దీంతో హిందూ దేవుళ్ళపై విమర్శలతోపాటు తిరుమల డిక్లరేషన్‌పై కూడా కొడాలి నాని పరుష వ్యాఖ్యలు చేశారు. సహజంగానే ఇది రాష్ట్రంలోని హిందూత్వవాదుల ఆగ్రహానికి కారణమైంది. కొడాలి నానిపై హిందుత్వవాదులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమయినా, వైసీపీ నుంచి ఎటువంటి వారింపు లేకపోవడంతో మంత్రి మరింత రెచ్చిపోయారు.

హిందూమత ఆచారాలతోపాటు ప్రదాని మోదీ, UP సిఎం ఆదిత్యనాథ్ ఇతర బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ తన పాండిత్యాన్ని ప్రదర్శించారు. తన వ్యాఖ్యలతో అధినేత జగన్ నుంచి మంచి మార్కులు వస్తాయని కొడాలి ఆశించి ఉండవచ్చు. కానీ ప్రధాని మోదీతో పాటు బీజేపీ నేతలపై కొడాలి చేసిన వ్యాఖ్యలు వైసీపీకి ఇబ్బందిగా పరిణమించాయి. వ్యవహారం శృతి మించి తమకు లేనిపోని ఇబ్బందులు సృష్టిస్తుందనే ఆందోళన వైసీపీలో వ్యక్తమయింది. దీనితో వైసీపీ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. తిరుమలలో విపక్షాలను టార్గెట్ చేస్తే బ్రహ్మాత్సవాలలో పట్టువస్త్రాలు సమర్పించేటప్పుడు జగన్ పక్కనే తనకు చోటు దక్కుతుందని కొడాలి బావించినట్లుంది, అయితే విషయం రివర్స్ అవడంతో పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో కొడాలి నానికి చోటుదక్కకుండా పోయింది. అంతే కాదు తరువాత వైసీపీ కీలక నేతలు కూడా కొడాలి నాని సంయమనం పాటించి ఉండాల్సిందనే హితోక్తులు చెప్పడం మంత్రికి షాక్‌లా మారింది. దీనితో తిరుమల నుంచి కొడాలి నాని నిశ్శబ్దంగా నిష్క్రమించాల్సి వచ్చింది. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలను తిట్టినప్పుడు శభాష్ అన్నవాళ్ళు, ప్రధాని మోదీని, ఇతర బీజేపీ నేతలను విమర్శిస్తే మటాష్ అని ఎందుకు అంటున్నారో కొడాలికి అర్ధం కావడంలేదని అటు స్వపక్షీయులతోపాటు విపక్షీయులు నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు.

కొడాలి వ్యాఖ్యాల పర్యవసానం ఏవిధంగా ఉంటుందోననే చర్చ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. కొందరు అయితే ఇంకొంత ముందుకు వెళ్ళి కొడాలి కారణంగా ఏపీలో రాజకీయ సెంటిమెంట్ పునరావృతం అవుతుందా అని కూడా లెక్కలు వేస్తున్నారు. వాస్తవంగా గుడివాడ నుంచి ఎంపికైన శాసనసభ్యునికి మంత్రి పదవి ఇస్తే ఆ ప్రభుత్వం పూర్తి కాలం పనిచేయదు అనే సెంటిమెంట్ ఎప్పటినుంచో ఉంది. 1955లో గుడివాడ నుంచి ఎంపికైన వేముల కూర్మయ్యకు ప్రకాశం పంతులు తన కేబినెట్ లో స్ధానం కల్పించారు. కాని ప్రకాశం పంతులు ప్రభుత్వం పూర్తి కాలం పనిచేయలేదు. తరువాత 1983లో గుడివాడ నుంచి గెలిచిన టీడీపీ వ్యవస్ధాపకులు NTR ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అయితే 1984లో నాదేండ్ల భాస్కరరావు కారణంగా ఎన్.టి.ఆర్ కు పదవి గండం ఎదురయింది. అందుకనే 1985లో ఎన్.టి.ఆర్. గుడివాడ నుంచి శాసనసభ్యుడుగా గెలిచినా సెంటిమెంట్‌తో గుడివాడకు రాజీనామా చేసి హిందూపురంను అట్టిపెట్టుకున్నారు అని అంటారు. అదేవిధంగా 1989లో గుడివాడ నుంచి ఎంపికయిన కఠారి ఈశ్వర్ కుమార్‌కి చెన్నారెడ్డి తన కేబినట్‌లో చోటు కల్పించారు. అయితే చెన్నారెడ్డి ప్రభుత్వం కూడా పూర్తికాలం కొనసాగలేదు. వీటన్నిటిని పట్టించుకోకుండా జగన్ గుడివాడ నుంచి ఎంపికయిన కొడాలి నానికి తన కేబినెట్‌లో చోటు కల్పించారు. దీనితో ఇప్పుడు కొడాలి నాని కారణంగా జగన్ సర్కార్‌కు కాలగండం ఏర్పడనుందా అనే చర్చసాగుతుంది.

మంత్రి కొడాలి వ్యాఖ్యలను బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంది. కొడాలిని భర్తరఫ్ చేసేంతవరకు నిరవధిక ఆందోళనలకు బీజేపీ పిలుపునిచ్చింది. కేంద్రంలో బలమైన ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ సహకారం.. రాష్ట్రంలోని వైసీపీకి ఎంతో అవసరం. అయితే ప్రధాని మోదీతోపాటు ఇతర బీజేపీ నేతలపై కొడాలి నాని వ్యాఖ్యల పట్ల ఇటు రాష్ట్ర బీజేపీతో పాటు అటు కేంద్ర బీజేపీ కూడా చాలా ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రధాని మోదీ, UP సీఎం యోగి ఆదిత్యనాధ్‌పై కొడాలి వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో.. కొడాలి నానిపై ఏదో ఒక చర్య తీసుకోక తప్పని పరిస్ధితి వైసీపీకి ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదానికి సంబంధించి రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయని, అవేంటో రానున్న రోజుల్లో ప్రత్యక్షంగా చూడవచ్చని కూడా బీజేపీ నేతలు అంతర్గతంగా వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. అతి ఏ విషయంలోనూ పనిచేయదనే అనే సూక్తి కొడాలి విషయంలో నిజం కానుందా అనే చర్చ రాష్ట్రంలో సాగుతోంది. మొత్తంగా జగన్‌కు అత్యంత విధేయుడిని తానే అని అనిపించుకునేందుకు.. కొడాలి నాని చేసిన ప్రయత్నాలు వికటించాయా..? విధేయత అనే వీరతాడు ఇప్పుడు ఉరితాడుగా మారి కొడాలి పదవికి ఎసరు పెట్టనుందా..? లేక సెంటిమెంట్‌ను నిజం చేస్తూ కొడాలి వ్యవహారం జగన్ సర్కార్ మెడకు చుట్టుకోనుందా అనే అంశాలపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story