NTR Health University Name Change: ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు.. వైసీపీ సీనియర్లు తీవ్ర అసంతృప్తి

NTR Health University Name Change: ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు.. వైసీపీ సీనియర్లు తీవ్ర అసంతృప్తి
NTR Health University Name Change: ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయంపై సీఎం జగన్‌ ఏకాకిగా మిగిలారు. వైసీపీలోని సీనియర్లలోనూ జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

NTR Health University: ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయంపై సీఎం జగన్‌ ఏకాకిగా మిగిలారు. వైసీపీలోని సీనియర్లలోనూ జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. టీడీపీతోనే రాజకీయ జీవితం ప్రారంభించి, ఇప్పుడు కీలక పదవుల్లో ఉన్న వైసీపీలోని సీనియర్లు జగన్ నిర్ణయాన్ని హర్షించడం లేదు.

పైకి అంబటి రాంబాబు, బుగ్గన లాంటి వాళ్లు కవర్‌ చేసుకోవాలని చూస్తున్నప్పటికీ.. మిగతా వాళ్లెవరూ జగన్ నిర్ణయానికి మద్దతుగా నిలబడడం లేదు. సభలో టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నప్పటికీ.. వైసీపీ నుంచి పెద్దగా రియాక్షన్‌ రాలేదని, జగన్ నిర్ణయం తప్పు అని చెప్పడానికి ఇదే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు.

సీఎం జగన్‌కు వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి గొప్పే అయినప్పటికీ.. వైఎస్‌కు సైతం ఎన్టీఆర్‌ అంటే అభిమానం ఉంది. ఆ మాటకొస్తే.. పార్టీలకు అతీతంగా ప్రతి రాజకీయ నాయకుడికి ఎన్టీఆర్‌పై ఎనలేని అభిమానం ఉంది. వైఎస్‌ కంటే ఎక్కువ పేరు, ప్రఖ్యాతలు ఎన్టీఆర్‌ సొంతం.

అలాంటి ఎన్టీఆర్‌ పేరును తొలగించే సాహసం చేయడంపై వైసీపీ నాయకులతో సహా వివిధ పార్టీల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఉన్నట్టుండి ఎన్టీఆర్‌ పేరును మార్చడం ఏంటని వామపక్ష నేతలు సైతం జగన్ నిర్ణయంపై మండిపడుతున్నారు.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. ఎన్టీఆర్‌ పేరును కొనసాగించాలంటూ సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్‌ చొరవతో ఏర్పాటైన యూనివర్సిటీకి.. ఆయన పేరునే కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పును వైసీపీలోని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ లీడర్లు సైతం హర్షించడం లేదు.

జగన్‌ నిర్ణయం పార్టీని దెబ్బ తీస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగన్ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించనప్పటికీ.. పేరు మార్పు బిల్లును వెనక్కి తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఎన్టీఆర్‌ పేరు తొలగించడమంటే.. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనంటూ ఏపీ బీజేపీ చీఫ్‌ సోమువీర్రాజు సైతం కామెంట్ చేశారు. హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు మార్చి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టాలనుకోవడంపై టీడీపీతో సహా వివిధ పార్టీలు, సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. టీడీపీకి మద్దతుగా బీజేపీ సహా పలు విద్యార్ధి సంఘాలు సైతం ఆందోళనకు దిగాయి.

ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సీటీ పేరు మార్పుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం నిర్ణయంపై ఎన్టీఆర్‌ అభిమానుల్లోనూ ఆగ్రహం పెల్లుబికింది. ఎన్టీఆర్‌ పేరును ఎలా తీసేస్తారంటూ ఆందోళనలు చేస్తున్నారు.

విజయవాడ గొల్లపూడిలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు మాజీ మంత్రి దేవినేని ఉమ. అటు ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పేరు మార్పుపై యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మనస్తాపం చెందారు. అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు యార్లగడ్డ ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story